South Indian CMs Meet: చెన్నైలో నేడు దక్షిణ రాష్ట్రాల సీఎంల సదస్సు.. ఇవే కీలక అంశాలు
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సదస్సుకు చెన్నై వేదిక కానుంది. గురువారం ఉదయం జరిగే ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షత వహించనున్నారు. దక్షిణ రాష్ట్రాల సీఎంలతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొననున్నారు. సమావేశానికి మీడియాకు అనుమతి లేదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. దక్షిణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు బుధవారం రాత్రే లాంఛనంగా ప్రారంభమైంది. తొలిరోజు ఆయా రాష్ట్రాలకు చెందిన అధికారులు సమావేశమైనట్లు సమాచారం. గురువారం ఉదయం సీఎంల స్థాయిలో కీలక చర్చలు జరగనున్నాయి. సమావేశానికి సంబంధించిన వివరాలను పీఐబీ వర్గాలు బుధవారం రాత్రి వెల్లడించాయి.
వివరాలు
ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల ఏర్పాటు అంశంపైనా చర్చ
అమిత్ షా అధ్యక్షతన జరిగే 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశానికి తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించనున్నట్లు పీఐబీ తెలిపింది.
ఈ భేటీలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం పరిధిలో ఇంకా పరిష్కారం కావాల్సిన అంశాలు సమావేశ ఎజెండాలో ప్రధానంగా ఉన్నాయి.
రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ, అంతర్రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు కూడా చర్చకు రానున్నాయి.
అదేవిధంగా మహిళలు, పిల్లలపై జరుగుతున్న అత్యాచార కేసులను వేగంగా విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల ఏర్పాటు అంశంపైనా చర్చించనున్నారు.
వివరాలు
దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం,పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఈ భేటీ కీలకం
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలు, విమానయాన రంగానికి సంబంధించిన మౌలిక వసతులు, విద్యారంగానికి సంబంధించిన అంశాలు కూడా సమావేశ ఎజెండాలో చేర్చారు.
దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం, పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఈ భేటీ కీలకంగా మారే అవకాశం ఉంది.
మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం రాత్రి చెన్నై చేరుకున్నారు.
ఆయన పర్యటించే మార్గాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు కూడా సదస్సులో పాల్గొనేందుకు బుధవారం రాత్రే చెన్నై చేరుకున్నారు.