UP Assembly Elections: యూపీలో ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు.. 181 సీట్లు కోరుతున్న కాంగ్రెస్.. అఖిలేశ్ ఆఫర్ 24 మాత్రమే!
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య పొత్తు చర్చలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో 181 సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ కోరుతుండగా.. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ మాత్రం కేవలం 24 స్థానాలే ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తొలుత కాంగ్రెస్‌కు సుమారు 24 స్థానాలు కేటాయించే ప్రతిపాదనను ఎస్పీ ముందుకు తీసుకురావచ్చని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎక్కువ సీట్లు సాధించాలంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా చర్చలు జరిపి బేరసారాలు చేయాల్సి ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
వివరాలు
181 స్థానాలు కోరుతున్న కాంగ్రెస్
యూపీలోని 403 అసెంబ్లీ స్థానాల్లో 181 చోట్ల పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. కూటమిలో సమాన భాగస్వామిగా ఉండాలన్నది ఆ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది.
వాస్తవానికి తొలుత 200 స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ యోచించింది. అయితే సీట్ల పంపకాలపై చర్చలకు సిద్ధమవుతున్న సమయంలో 181 స్థానాలకు సంబంధించిన జాబితా బయటకు వచ్చింది.
ఈ జాబితాలో ఎస్పీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్‌కు సంప్రదాయంగా బలం ఉన్న అమేథీ, రాయ్‌బరేలీ, సహరాన్‌పూర్ వంటి ప్రాంతాల్లో ఎక్కువ స్థానాలను కోరుతోంది.
అయితే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో ఎస్పీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచారు.
వివరాలు
2022 ఎన్నికల ఫలితాల ఆధారంగా సీట్ల కేటాయింపు?
మరోవైపు ప్రస్తుతం ఎస్పీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలను తమ వద్దే ఉంచుకోవాలని అఖిలేశ్ యాదవ్ పార్టీ భావిస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఓట్ల ఆధారంగానే సీట్ల పంపకాలు చేపట్టాలని ఎస్పీ యోచిస్తున్నట్లు సమాచారం.
ముఖ్యంగా 2022 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 20 వేలకు పైగా ఓట్లు సాధించిన నియోజకవర్గాలను సీట్ల కేటాయింపులో పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ లెక్కన కాంగ్రెస్ కోరుతున్న 181 స్థానాలకు ఎస్పీ అంగీకరిస్తుందా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
వివరాలు
2022లో కాంగ్రెస్‌కు దక్కింది రెండే సీట్లు!
గత ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ వేర్వేరుగా పోటీ చేశాయి. 2022 ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా ఒంటరిగా బరిలోకి దిగి కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.
అంతకుముందు 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎస్పీతో పొత్తు పెట్టుకుంది. ఆ ఎన్నికల్లో 114 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం ఏడు సీట్లకే పరిమితమైంది.
మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ 311 స్థానాల్లో పోటీ చేసి 47 చోట్ల విజయం సాధించింది.
ఒకప్పుడు ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఉన్న కాంగ్రెస్.. 1989 వరకు రాష్ట్రాన్ని పాలించింది. అయితే ఆ తర్వాత క్రమంగా తన రాజకీయ ప్రభావాన్ని కోల్పోతూ వచ్చింది.