Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద శరవేగంగా పడవల తొలగింపు ప్రక్రియ.. కష్టపడుతున్న నిపుణులు
ప్రకాశం బ్యారేజీ వద్ద ఆరో రోజు కూడా భారీ పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అబ్బులు బృందం ఇనుప రోప్‌లు కట్టి పొక్లెయిన్‌తో బోట్లను లాగుతోంది. మూడ్రోజులుగా ప్రయత్నిస్తున్నా బోటు 20 మీటర్లు మాత్రమే కదిలింది. అవి ఇసుకలో ఇరుక్కుపోవడంతో తొలగింపు ప్రక్రియ కష్టతరంగా మారింది.
దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్లు
ఇటీవల ప్రకాశం బ్యారేజీ వద్ద వరదకు ఎగువ నుంచి పడవలు కొట్టుకువచ్చాయి. అవి 67, 68, 69 గేట్లను ఢీకొట్టాయి. దీంతో రెండు గేట్లు దెబ్బతిన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగా వైసీపీ నాయకులు చేశారనే అనుమానాలను పలువురు మంత్రులు వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.