Guntur: మన ఎండు మిర్చికి శ్రీలంక షాక్.. పదుల సంఖ్యలో కంటెయినర్లు తిరస్కరణ
ఈ వార్తాకథనం ఏంటి
గుంటూరు నుంచి ఎగుమతి చేసిన మిర్చి సరకు శ్రీలంకలో తిరస్కరణకు గురైంది. మిర్చిలో అఫ్లోటాక్సిన్ పరిమితికి మించి ఉండటంతోపాటు తేమ శాతం అధికంగా ఉండటమే ఇందుకు కారణమని అధికారులు గుర్తించారు. ఈ ఏడాది జూన్‌లో గుంటూరు నుంచి ఎగుమతి చేసిన మూడు కంటెయినర్లను చైనా తిరస్కరించగా.. తాజాగా శ్రీలంక పదుల సంఖ్యలో కంటెయినర్లను వెనక్కి తీసుకురావాలని ఆదేశించింది. సమస్యను పరిష్కరించేందుకు కొందరు ఎగుమతి వ్యాపారులు శ్రీలంక వెళ్లి అక్కడి అధికారులతో చర్చలు జరుపుతున్నారు. మిర్చి ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. గుంటూరు యార్డుకు రైతులు తీసుకొచ్చిన మిర్చిని వ్యాపారులు కొనుగోలు చేసి దేశీయ మార్కెట్లతోపాటు విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు.
వివరాలు
ఆహార నాణ్యత నిబంధనలు కఠినంగా అమలు
ఈ ఏడాది జులై నుంచి శ్రీలంకకు పంపిన సరుకులో పదుల సంఖ్యలో కంటెయినర్లను ఆ దేశం తిరస్కరించింది.
శ్రీలంక స్టాండర్డ్స్ ఇన్‌స్టిట్యూషన్ (ఎస్‌ఎల్‌ఎస్‌ఐ) ఇటీవల ఆహార నాణ్యత నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది.
ఏపీ నుంచి చెన్నై పోర్టు మీదుగా శ్రీలంకకు చేరిన మిర్చి కంటెయినర్ల నుంచి అక్కడి అధికారులు నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపిస్తున్నారు.
పరీక్షల్లో మిర్చిలో అఫ్లోటాక్సిన్, తేమ శాతం నిర్దేశిత పరిమితికి మించి ఉన్నట్లు తేలింది. దీంతో సరుకును తిరిగి తీసుకెళ్లాలని ఎస్‌ఎల్‌ఎస్‌ఐ అధికారులు ఎగుమతి వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు.
తేమ అధికంగా ఉండటంతో కొన్ని కంటెయినర్లలో ఫంగస్ కూడా ఏర్పడి మిర్చి నాణ్యత దెబ్బతిన్నట్లు గుర్తించారు
వివరాలు
రెండు నెలల్లో పదుల సంఖ్యలో కంటెయినర్లకు దెబ్బ
ఈ సమస్యపై కొందరు ఎగుమతి వ్యాపారులు శ్రీలంకకు వెళ్లి అక్కడి అధికారులతో చర్చిస్తున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహార సరుకుల్లో నాణ్యత విషయంలో రాజీ పడబోమని శ్రీలంక అధికారులు స్పష్టం చేసినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
ఒక్కో విడతలో మూడు, నాలుగు కంటెయినర్ల చొప్పున మిర్చి సరకు తిరస్కరణకు గురవుతోంది. దీంతో రెండు నెలల వ్యవధిలోనే పదుల సంఖ్యలో కంటెయినర్లను భారత్‌కు తిరిగి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మిర్చి సరకు శ్రీలంకకు చేరిన తర్వాత అక్కడి ప్రయోగశాల నుంచి పరీక్షా నివేదిక రావడానికి సుమారు రెండు వారాల సమయం పడుతోంది.
తిరస్కరణకు గురైన సరుకును భారత్‌కు తీసుకొచ్చిన తర్వాత మళ్లీ రీప్యాకింగ్ చేసి స్థానిక మార్కెట్‌లో విక్రయించడం కూడా వ్యాపారులకు ఇబ్బందిగా మారింది.
వివరాలు
సుగంధద్రవ్యాల బోర్డుకు సమస్య వివరాలు
మిర్చి నాణ్యతకు తమకు సంబంధం లేకపోయినా తిరస్కరణల కారణంగా తాము నష్టపోవాల్సి వస్తోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యను వ్యాపారులు సుగంధద్రవ్యాల బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కొచ్చిలో జరిగిన సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు మిర్చి ఎగుమతి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు తోట రామకృష్ణ తెలిపారు.
స్థానిక కోల్డ్‌స్టోరేజీల నుంచి మిర్చిని బయటకు తీసి ప్యాకింగ్ చేసి వెంటనే రవాణా చేయడం వల్ల కొన్నిసార్లు తేమ శాతం పెరుగుతోందని ఆయన వివరించారు.
ఈ అంశంపై శ్రీలంక అధికారులతో చర్చించాలని కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం వారితో సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పారు.
వివరాలు
యాజమాన్య పద్ధతులను సరిగ్గా అమలు చేయడం లేదు
మిర్చి సాగు సమయంలో అధికంగా పురుగుమందులు వినియోగించడం, కోత అనంతరం పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను సరిగా అమలు చేయకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని రామకృష్ణ పేర్కొన్నారు.
రైతులు సాగు, కోత అనంతర నిర్వహణలో తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.