
Sri Ramayana Yatra Train: ఈనెల 25 నుంచి శ్రీ రామాయణ యాత్ర రైలు ప్రయాణం ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్రకటించిన ఐదో 'శ్రీరామాయణ యాత్ర' ఈ నెల 25న ప్రారంభం కానుంది. మొత్తం 17 రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రత్యేక రైలు యాత్రలో భక్తులు శ్రీరాముని జీవితానికి సంబంధించి 30 పవిత్ర ప్రదేశాలను సందర్శించే అవకాశం పొందనున్నారు. ఈ యాత్ర దిల్లీ సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. యాత్రలో భాగంగా అయోధ్య, నందిగ్రామ్, సీతామఢి, జానక్‌పుర్, బక్సర్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్, నాసిక్, హంపి వంటి ప్రముఖ ప్రదేశాలను కవర్ చేయనున్నారు. చివరగా రామేశ్వరంలో ఈ యాత్ర ముగియనుంది.
Details
త్రీస్టార్ హోటళ్లలో వసతి, భోజనం
ఈ యాత్రకు సంబంధించి ప్యాకేజీ ధరలు కూడా అధికారులచే వెల్లడించారు. థర్డ్ ఏసీ టికెట్ ధర ఒక్కరికి రూ.1,17,975 కాగా, సెకండ్ ఏసీకి రూ.1,40,120. ఇక ఫస్ట్ క్లాస్ ఏసీ క్యాబిన్ ధర రూ.1,66,380 కాగా, ఫస్ట్ ఏసీ కూపె ధర రూ.1,79,515గా నిర్ణయించారు. ఈ ప్రయాణంలో త్రీ స్టార్ హోటళ్లలో వసతి, భోజనం, ప్రయాణ బీమా తదితర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ అధికారులు స్పష్టంచేశారు. భక్తులు సౌకర్యవంతంగా, ఆధ్యాత్మికతతో కూడిన ఈ యాత్రను అనుభవించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు.