Srisailam: శ్రీశైలం డ్యాం మరమ్మతులకు కదలిక.. కేంద్ర జలసంఘం నిపుణుల కమిటీ ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన డ్యాం, ప్లంజ్‌పూల్ మరమ్మతుల విషయంలో ఎట్టకేలకు ముందడుగు పడింది. ఆరేళ్లకు పైగా కాలంగా నిపుణుల కమిటీలు ఇచ్చిన నివేదికలు ఫైళ్లకే పరిమితమవ్వగా, ఇప్పుడు కేంద్ర స్థాయిలో కదలిక కనిపిస్తోంది. గత ఏడాది మే నెలలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) చేసిన సూచనలు, అలాగే ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
వివరాలు
సీడబ్ల్యూసీ రెండు రాష్ట్రాలకు అధికారికంగా లేఖ
ఈ కమిటీలో కేంద్ర జలసంఘం, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్‌ఎంఆర్‌ఎస్), సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) సంస్థల ప్రతినిధులతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇంజినీర్లు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నుంచి డైరెక్టర్ స్థాయి అధికారి సభ్యులుగా ఉంటారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సీడబ్ల్యూసీ రెండు రాష్ట్రాలకు అధికారికంగా లేఖ పంపింది.
వివరాలు
దెబ్బతిన్న ఆప్రాన్...ప్లంజ్ పూల్‌లో భారీ గొయ్యి
శ్రీశైలం డ్యాం దిగువ భాగంలో ఉన్న ఆప్రాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు, ప్లంజ్‌పూల్‌లో భారీ గొయ్యి ఏర్పడటం డ్యాం భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. గేట్ల నుంచి భారీగా నీటిని విడుదల చేసినప్పుడు కింద పడే ప్రాంతమైన ప్లంజ్‌పూల్‌లో ఈ పరిస్థితి ఏర్పడింది. ఎన్‌డీఎస్‌ఏ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం గత ఏడాది డ్యాంను పరిశీలించి తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. 2025 మే నెలలో తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత నివేదికను సమర్పించింది. కొన్నేళ్లుగా వివిధ కమిటీలు డ్యాంను పరిశీలించి నివేదికలు ఇచ్చినా, చేసిన సిఫార్సులు అమలు కాకపోవడంపై ఎన్‌డీఎస్‌ఏ అసంతృప్తి వ్యక్తం చేసింది.
వివరాలు
స్పిల్‌వే రక్షణ కోసం ఏర్పాటు చేసిన సిలిండర్లలో ఒకటి మార్చాల్సిన అవసరం
డ్యాం భద్రత విషయంలో రాజీ పడుతున్నారని స్పష్టంగా పేర్కొంది. డ్యాం దిగువన ఆప్రాన్ చివరి భాగం నుంచి 50 నుంచి 220 మీటర్ల వరకు భారీగా గుంత ఏర్పడిందని, ప్లంజ్‌పూల్‌లో లోతు 122 మీటర్ల నుంచి 160మీటర్ల వరకు పెరిగిందని నివేదికలో వెల్లడించింది. ప్లంజ్‌పూల్‌లో మరింత కోత జరగకుండా,స్పిల్‌వే రక్షణ కోసం ఏర్పాటు చేసిన సిలిండర్లలో ఒకటి నుంచి 39 వరకు తప్పనిసరిగా మార్చాల్సిన అవసరం ఉందని సూచించింది. డ్యాం మరమ్మతుల కోసం చేపట్టాల్సిన తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలిక పరిష్కారాలను కూడా ఎన్‌డీఎస్‌ఏ వివరించింది. ఎనిమిదో బ్లాక్ నుంచి 12వ బ్లాక్ వరకు స్టెబిలిటీ అనాలిసిస్ నిర్వహించాలని,దీర్ఘకాలిక చర్యల కోసం కేంద్ర జలసంఘాన్ని సంప్రదించాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖకు స్పష్టం చేసింది.
వివరాలు
కమిటీ బాధ్యతలు ఇవే
శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది.ఎన్‌డీఎస్‌ఏ సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ పలుమార్లు కేంద్ర జలసంఘంతో చర్చలు జరిపిన తర్వాత ఈ నిపుణుల కమిటీ ఏర్పాటుకు ఆమోదం లభించింది. ప్లంజ్‌పూల్‌కు జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేయడం,సాంకేతిక సమీక్ష చేయడం, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘటనలపై జరిగిన అధ్యయనాల కేస్ స్టడీస్‌ను పరిశీలించడం,వాటి నుంచి తీసుకోవాల్సిన పాఠాలను గుర్తించడం,ఉత్తమ పద్ధతులు అమలు చేసే అవకాశాలను పరిశీలించడం,అవసరమైన సాంకేతిక పరిశోధనలు చేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యతలు. అంతేకాకుండా పునరుద్ధరణ చర్యలను సిఫార్సు చేయడం, వాటి అమలు ప్రణాళిక సిద్ధం చేయడం, అవసరమైన డిజైన్లు, డ్రాయింగ్స్ ఇవ్వడం, నిరంతరం సాంకేతిక సలహాలు అందించడం కూడా కమిటీ పరిధిలోకి వస్తాయని సీడబ్ల్యూసీ వెల్లడించింది.
వివరాలు
ఛైర్మన్‌గా వివేక్ త్రిపాఠీ
ఈ నిపుణుల కమిటీకి కేంద్ర జలసంఘం డిజైన్స్ విభాగం చీఫ్ ఇంజినీర్ వివేక్ త్రిపాఠీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. సీడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్‌ల నుంచి సోమేశ్‌కుమార్, సమర్థ్ అగర్వాల్, అరుణ్ ప్రతాప్ సింగ్, మధుకాంత్ గోయల్ సభ్యులుగా ఉంటారు. సీఎస్‌ఎంఆర్‌ఎస్ నుంచి మనీశ్ గుప్తా, సీడబ్ల్యూపీఆర్‌ఎస్ నుంచి ఎం.కె. వర్మ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) నుంచి శైలేంద్ర సింగ్ కమిటీలో భాగంగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ తరఫున కర్నూలు జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్‌ను సభ్యుడిగా నియమించనున్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖ, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తమ సభ్యుల పేర్లు తెలియజేయాలని సీడబ్ల్యూసీ కోరింది.