Loading...
Srisailam: శ్రీశైలంలోకి 2.43 లక్షల క్యూసెక్కుల వరద.. నాలుగు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం
శ్రీశైలంలోకి 2.43లక్షల క్యూసెక్కుల వరద..నాలుగు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం

Srisailam: శ్రీశైలంలోకి 2.43 లక్షల క్యూసెక్కుల వరద.. నాలుగు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2026
08:35 am

ఈ వార్తాకథనం ఏంటి

కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం సాయంత్రానికి ఈ సీజన్‌లోనే అత్యధికంగా శ్రీశైలం జలాశయంలోకి 2.43 లక్షల క్యూసెక్కుల వరద చేరింది. దీంతో జలాశయం నీటిమట్టం 867 అడుగులకు చేరగా, నీటి నిల్వ 130 టీఎంసీలకు పెరిగింది. ఇదే స్థాయిలో వరద మరో నాలుగు రోజుల పాటు కొనసాగితే శ్రీశైలం గేట్లు ఎత్తే పరిస్థితి ఏర్పడే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన ఉన్న ఆలమట్టి జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అక్కడికి 1.35 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 1.50 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.

వివరాలు 

తుంగభద్ర ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం

నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి 1.45 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతుండగా,మధ్యలో కురిసిన వర్షాలు, భీమా నది నుంచి చేరిన ప్రవాహంతో కలిపి జూరాల ప్రాజెక్టుకు 2.52 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది.

అక్కడి నుంచి 2.49 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

తుంగభద్ర ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం గణనీయంగా పెరిగింది.

బుధవారం సాయంత్రానికి లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదుకాగా, జలాశయంలో 60 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

ప్రస్తుతం ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టుకు ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు చెబుతున్నారు.

ఇదే స్థాయిలో వరద మరో నాలుగు రోజుల పాటు కొనసాగితే తుంగభద్ర జలాశయ గేట్లు ఎత్తి నీటిని శ్రీశైలానికి విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వివరాలు 

శ్రీరామసాగర్‌కు 28 వేల క్యూసెక్కుల ప్రవాహం

మొత్తంగా కృష్ణా బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి పరిస్థితి ఆశాజనకంగా మారింది.

గోదావరి నది ద్వారా శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి బుధవారం ఉదయం 30 వేల క్యూసెక్కుల వరద చేరగా, మధ్యాహ్నానికి అది 28 వేల క్యూసెక్కులకు తగ్గింది.

ప్రస్తుతం జలాశయంలో 37 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, పూర్తిస్థాయికి చేరుకోవాలంటే మరో 43.5 టీఎంసీలు అవసరమని అధికారులు తెలిపారు.

స్థానికంగా కురిసిన వర్షాల ప్రభావంతోనే ఈ ప్రవాహం నమోదైంది.

ADVERTISEMENT

వివరాలు 

శ్రీరామసాగర్‌కు 28 వేల క్యూసెక్కుల ప్రవాహం

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 8,900 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, అక్కడ నీటి నిల్వ 10 టీఎంసీలకు చేరింది.

కడెం ప్రాజెక్టుకు 4,300 క్యూసెక్కులు, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 2,600 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది.

ఎల్లంపల్లి నుంచి నంది పంపుహౌస్ ద్వారా మధ్య మానేరు జలాశయానికి నీటి విడుదల కొనసాగుతోంది.

మధ్య మానేరు ప్రాజెక్టులోకి 14,500 క్యూసెక్కుల ప్రవాహం చేరగా, ప్రస్తుతం 17 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

పూర్తి స్థాయికి చేరుకోవాలంటే మరో 10 టీఎంసీలు అవసరం. ప్రాణహిత నది నుంచి వస్తున్న నీటితో కలిపి మేడిగడ్డ బ్యారేజీ నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ప్రాజెక్టులపై నేడు కీలక సమావేశం

రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, వాటి వినియోగంపై నిర్ణయం తీసుకునేందుకు బుధవారం జరగాల్సిన రాష్ట్రస్థాయి చీఫ్ ఇంజినీర్ల కమిటీ సమావేశాన్ని గురువారానికి వాయిదా వేశారు.

ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రి, నీటిపారుదల శాఖ కార్యదర్శి, పలువురు చీఫ్ ఇంజినీర్లు కేంద్ర జలశక్తి మంత్రిని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లాల్సి రావడంతో సమావేశాన్ని వాయిదా వేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ADVERTISEMENT