Srisailam: శ్రీశైలం జలాశయానికి 36,233 క్యూసెక్కుల వరద.. నిలకడగా నీటిమట్టం
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల జలాశయానికి వస్తున్న వరద క్రమంగా తగ్గడంతోపాటు విద్యుత్తు ఉత్పత్తి, కృష్ణానది జలాలపై ఆధారపడిన ఇతర జలాశయాలకు నీటిని విడుదల చేస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టంలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ప్రస్తుతం జలాశయంలోకి 36,233 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఆదివారం సాయంత్రం నాటికి శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 878.60 అడుగులకు చేరింది. నీటి నిల్వ 181.0590 టీఎంసీలుగా నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవాలంటే ఇంకా ఆరు అడుగుల మేర నీరు రావాల్సి ఉంది.
వివరాలు
జూరాల జలాశయానికి వస్తున్న వరద ఉద్ధృతి తగ్గుముఖం
జలాశయం నుంచి వివిధ అవసరాల కోసం భారీగా నీటిని విడుదల చేస్తున్నారు.
ఏపీ జల విద్యుత్తు కేంద్రానికి 26,093 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీహెచ్‌ఈఎస్‌కు 22,419 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
అలాగే హంద్రీనీవా సుజల స్రవంతికి 1,611 క్యూసెక్కులు, ఎంజీకేఎల్‌ఐకి 1,917 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు జలాశయానికి 8 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
మరోవైపు జూరాల జలాశయానికి వస్తున్న వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది.
దీంతో ఆదివారం ఉదయం నుంచే జూరాల గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేయడాన్ని అధికారులు నిలిపివేశారు.
ప్రస్తుతం జూరాల జలాశయంలోకి 63 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. అందులో నుంచి విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు 43 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.