SLBC: శ్రీశైలం సొరంగం ప్రమాదం.. 16 రోజుల తర్వాత మృతదేహం వెలికితీత
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్‌బీసీ) సొరంగంలో 16 రోజుల నిరంతర గాలింపుల తర్వాత ఒక మృతదేహాన్ని వెలికి తీశారు.
దాదాపు 12 గంటల పాటు శ్రమించి, 12 అడుగుల లోతులో గడ్డకట్టిన బురదలో చిక్కుకున్న మృతదేహాన్ని బయటికి వెలికితీశారు. మిగిలిన కార్మికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఫిబ్రవరి 22న ఎస్ఎల్‌బీసీ సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) పనిలో ఉన్న సమయంలో భారీగా నీరు, బురద ఒక్కసారిగా ప్రవహించడంతో కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. అప్పటి నుంచి సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
Details
మృతదేహాన్ని స్వస్థలానికి తరలించిన పోలీసులు
శనివారం రాత్రి గాలింపు చర్యల సమయంలో టీబీఎం మెషిన్ ఎడమ వైపున 6 అడుగుల లోతులో ఒక చేయి, చేతికి కడియం కనిపించాయి.
అయితే ఆ ప్రదేశంలో బురద గట్టిపడి ఉండటంతో దాదాపు 12 గంటలపాటు శ్రమించి మృతదేహాన్ని వెలికితీశారు.
మృతదేహం పూర్తిగా చెరిగిపోయిన స్థితిలో ఉండటంతో చేతికి ఉన్న కడియం ఆధారంగా అతన్ని గుర్తించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రకటన ప్రకారం, మృతదేహం పంజాబ్‌కు చెందిన టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్‌గా నిర్ధారించారు.
గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని స్వస్థలమైన పంజాబ్‌కు తరలించారు. కేరళ నుంచి వచ్చిన క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశంలో తవ్వకాలు చేపట్టగా మృతదేహం బయటపడింది.
Details
రూ. 25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం
ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ క్రమంలో టీబీఎం యంత్రాన్ని కొంత మేరకు తొలగించారు.
టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ కుటుంబానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు.
ఆయన మృతిపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం తెలిపారు. రెవెన్యూ అధికారులు రూ.25 లక్షల చెక్కును సిద్ధం చేసి, గురుప్రీత్ కుటుంబానికి అందజేసేందుకు ఇద్దరు సహాయకులను మృతదేహంతో పాటు పంపినట్లు తెలిపారు.
గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించిన ప్రదేశంలోనే మిగిలిన కార్మికుల మృతదేహాలు కూడా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.