Srisailam: శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో మిలమిలా మెరుస్తూ భక్తుల మనసులను ఆనందపరిచాయి. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం ఈవో ఎం. శ్రీనివాసరావు వెల్లడించారు.
బ్రహ్మోత్సవాల భాగంగా గురువారం రెండవ రోజు స్వామివారి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు.
సాయంత్రం భృంగి వాహన సేవ ప్రత్యేకంగా నిర్వహించనున్నారు.
లోకక్షేమం కోసం రుద్రహోమం,చండీహోమం,జపాలు, పారాయణాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
మహోత్సవాల ప్రారంభ రోజున యాగశాలలో అర్చకులు, వేదపండితుల సమక్షంలో ఈవో శ్రీనివాసరావు పూజ కార్యక్రమాలను ప్రారంభించారు.
తొమ్మిది రోజుల పాటు కొనసాగనున్న ఈ మహోత్సవాల్లో ప్రత్యేక పూజలు, రథోత్సవం, లింగోద్భవ సమయానికి విశేష అభిషేకాలు జరుపుతారు.
వివరాలు
రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు
భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు ఈవో తెలిపారు.
ఆలయ దర్శనార్థం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు తాత్కాలిక వసతిగృహాలను సిద్ధం చేశారు.
భక్తుల కోసం ఉచిత అన్నప్రసాదం, స్వచ్ఛమైన తాగునీరు, పార్కింగ్ సౌకర్యాలను అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు.
పాదయాత్ర భక్తుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచినట్లు వివరించారు.
భక్తుల ప్రయాణ సౌలభ్యం కోసం పార్కింగ్ ప్రాంతాల నుంచి సత్రాల వరకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందుబాటులో ఉంచారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.