Telangana: రోడ్డు ప్రమాదాల నివారణకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
రోడ్డుప్రమాదాలను నియంత్రించి ప్రజల భద్రతను పెంచాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రాత్రి సమయాల్లో రోడ్లపై నడిచే రవాణా వాహనాలు స్పష్టంగా కనిపించేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా,రవాణా వాహనాలపై క్యూఆర్ కోడ్ కలిగిన రిఫ్లెక్టివ్ టేపులు,రియర్ మార్కింగ్ ప్లేట్లు తప్పనిసరిగా అమర్చాలని ఆదేశించింది. ఈనిబంధనలు ఫిబ్రవరి 20నుంచి అమల్లోకి వస్తాయని రవాణాశాఖ గురువారం వెల్లడించింది. రవాణా వాహనాలకు ప్రతి సంవత్సరం జారీ చేసే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాలంటే రిఫ్లెక్టివ్ టేపులు తప్పనిసరి అని శాఖ స్పష్టం చేసింది. ఈరిఫ్లెక్టివ్ టేపుల అమరిక ప్రక్రియ కోసం మొత్తం 5 కంపెనీలను ఎంప్యానెల్ చేసినట్లు తెలిపింది. ఎంపికైన ఈ సంస్థలకు 2027 ఫిబ్రవరి 8 వరకు అనుమతి ఉంటుందని వివరించింది.
వివరాలు
టేపులు అమర్చిన అనంతరం వాహన యజమానికి ధ్రువీకరణ పత్రం
వాహనాలపై అమర్చే రిఫ్లెక్టివ్ టేపులపై తెలంగాణ రవాణాశాఖ లోగోతో పాటు ప్రత్యేక సీరియల్ నంబర్ ఉన్న క్యూఆర్ కోడ్ ఉండనుంది. టేపులు అమర్చిన అనంతరం వాహన యజమానికి ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. ఆ పత్రంలో వాహనం నంబరు, టేపులు అమర్చిన కంపెనీ వివరాలు, ఫోటో, వారంటీ సమాచారం ఉంటాయని రవాణాశాఖ పేర్కొంది. అలాగే, ఎంప్యానెల్ చేసిన సంస్థల అధీకృత డీలర్ల నుంచే రిఫ్లెక్టివ్ టేపులు తీసుకోవాలని వాహనదారులకు సూచించింది. ఈ చర్యల ద్వారా రాత్రి వేళల్లో వాహనాల దర్శనీయత పెరిగి ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.