Telangana : మారుమూల తండాలకు రోడ్ల కోసం కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో రహదారి సౌకర్యాలు పూర్తిగా లేని దూర ప్రాంత గిరిజన తండాలు, గ్రామాలు మొత్తం 227 ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటిలో కాలిబాటలు కూడా అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్న 149గ్రామాలను మొదటి దశలో ఎంపిక చేసి, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కింద నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రతిపాదనలు పంపింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే నిధులు విడుదల చేస్తే వెంటనే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మొత్తం 301.93 కిలోమీటర్ల మేర రహదారులను ఆమోదించాలని విజ్ఞప్తి చేసింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే, అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 49గ్రామాలకు 104.39 కిలోమీటర్ల పొడవున రహదారులు మంజూరు చేయాలని ప్రతిపాదించింది.
వివరాలు
కేంద్ర అటవీ శాఖ అనుమతుల కోసం ఎదురుచూపులు
కుమురంభీం జిల్లాలో 28 గ్రామాలు, నారాయణపేటలో 27 గ్రామాలు, మంచిర్యాలలో 8 గ్రామాలు, కొత్తగూడెంలో 8 గ్రామాలు, కరీంనగర్‌లో 7 గ్రామాలు, నల్గొండలో 4 గ్రామాలు, సంగారెడ్డిలో 4 గ్రామాలు, ములుగులో 3 గ్రామాలు, మహబూబ్‌నగర్‌లో 2 గ్రామాలు, వనపర్తిలో 2 గ్రామాలకు రహదారులు అవసరమని పేర్కొంది. అలాగే జగిత్యాల, జనగామ, నాగర్‌కర్నూల్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో ఒక్కో గ్రామానికి కూడా ఇప్పటికీ రహదారి సౌకర్యం లేకపోవడంతో వాటికి కూడా ఆమోదం ఇవ్వాలని కేంద్రాన్ని అభ్యర్థించింది. అదనంగా, 34 గ్రామాల్లో మొత్తం 148.66 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి సంబంధించి కేంద్ర అటవీ శాఖ నుంచి అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది.