'జై శ్రీరామ్ అన్నందుకే ఈ దారుణం'.. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్ల దాడి
పశ్చిమ బెంగాల్‌లో హౌరా నుంచి న్యూ జల్‌పాయిగుఢి మధ్య ఇటీవల ప్రారంభమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. మాల్దా జిల్లాలోని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మాల్దా పట్టణానికి 50కిలోమీటర్ల దూరంలో దాడి జరిగనట్లు అధికారులు చెప్పారు. దుండగుల దాడి కారణంగా సీ13 కోచ్‌లో అద్దాలు ధ్వంసమైనట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. రైలుపై దాడి జరిగినా.. ఆ ట్రైన్ ఎక్కడా ఆగలేదని, నేరు తర్వాతి స్టేషన్ అయిన మాల్దాలోనే ఆగినట్లు వివరించారు. రైల్వే పోలీసులు ఈ దాడిని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
'ఎన్ఐఏతో విచారణ జరిపించాలి'
వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్ల దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. హౌరా రైల్వే స్టేషన్ వద్ద జై శ్రీరామ్ అని నినదించడం వల్లే ఈ దాడి చేసినట్లు బీజేపీ సీనియర్ నేత సువెందు అధికారి చెప్పాపారు. జై శ్రీరామ్ నినాదాలు చేయడమై నేరమా? అంటూ ప్రశ్నించారు. రైలు దాడిని అంత తేలికగా తీసుకోవద్దని, తీవ్రంగా పరిగణించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఎన్ఐఏతో విచారణ జరిపించి.. నిందితులను కఠినంగా శిక్షించాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు. కన్నతల్లి మరణించిన బాధను దిగమింగుకొని ప్రధాని మోదీ.. డిసెంబర్ 30న వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దీంతో బీజేపీ శ్రేణులు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.