Metro: స్టేషన్‌లో ఆగితే బాదుడే… కొత్త మెట్రో నిబంధనలతో ప్రయాణికులకి షాక్!
ఈ వార్తాకథనం ఏంటి
రోజూవారీగా మెట్రోలో ప్రయాణించే వారైతే ఇకపై కొంచెం జాగ్రత్తపడాల్సిందే. టికెట్ కొనుగోలు చేసిన తర్వాత మెట్రో స్టేషన్ ప్రాంగణంలో రెండు గంటలకంటే ఎక్కువ గడిపితే... మెట్రో నిర్వహణ అదనపు చార్జీలను వసూలు చేస్తోంది. స్నేహితుల కోసం వేచి ఉండడం, రద్దీ వల్ల మరో ట్రైన్ కోసం ఆగడం, లేదా గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత ఫుడ్ కోర్టులు, షాపింగ్ మాల్స్‌లో టైమ్ గడపడం—ఇలాంటివాటన్నింటిపై ఈ కొత్త నిబంధన ప్రభావం పడుతోంది. రెండు గంటలకు మించిన ప్రతి గంటకు ప్లాట్‌ఫాం ఛార్జిల మాదిరిగానే అదనపు ఫీజులు వసూలవుతున్నాయి.
Details
ప్రయాణికులపై అదనంగా రూ.15-50 భారం
మెట్రోలో పెరుగుతున్న రద్దీకి సరిపోయే మౌలిక వసతులు సృష్టించాల్సిన బదులు, సంస్థ కొత్త ఆదాయ మార్గాలపై దృష్టి పెడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పూర్తి వాటా ప్రభుత్వానికి వెళ్లిన తరువాత పెరిగిన అప్పులను తగ్గించుకోవడమే ఈ నిర్ణయానికి కారణమని వర్గాలు చెబుతున్నాయి. ఈ నిబంధన వల్ల ప్రయాణికులపై రూ.15 నుంచి రూ.50 వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది.
Details
టికెట్ తీసుకున్న వెంటనే టైమ్ క్లాక్ ఆన్
ప్రయాణికుడు టికెట్‌తో స్టేషన్‌లోకి ప్రవేశించిన క్షణం నుంచి రెండు గంటల లోపే ప్రయాణం పూర్తవ్వాలి. అంతకంటే ఎక్కువ సమయం స్టేషన్ ప్రాంగణంలో తిరిగితే, మాల్స్, మల్టీప్లెక్సులు, ఫుడ్‌కోర్టుల్లో గడిపితే సరే... అదనపు చార్జీలు తప్పవు. కొంతమంది స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత తిరిగి లోపలకి వెళ్లి ఎక్కువసేపు స్టేషన్ ప్రాంగణంలో ఉంటారని గుర్తించిన తర్వాతే ఈ నియమం కఠినంగా అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మరోవైపు మెట్రో ఆలస్యం, రద్దీ, ట్రైన్ లేటుగా రావడం వంటి కారణాల వల్ల ప్రయాణికులు ఆలస్యమయితే... రెండు గంటలు ఒక నిమిషం దాటినా కూడా ఫీజులు వసూలవుతుండడంతో చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Details
ఎందుకు ఈ అదనపు వసూళ్లు?
ఇటీవల సోషల్ మీడియాలో కూడా ఇలాంటి ఫిర్యాదులు గణనీయంగా పెరిగాయి. అయినప్పటికీ మెట్రో అధికారులు ఈ విషయంలో ఇప్పటివరకు ఏ అధికారిక ప్రకటన చేయలేదు. మెట్రో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో, నిర్వహణలో పెరిగిన వ్యయాన్ని నేరుగా ప్రయాణికులపైకి మళ్లిస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. చార్జీల పెంపు నుండి పరిమిత సమయ విధానం వరకు—ఇటీవల మెట్రో తీసుకొస్తున్న మార్పులు అన్నీ ఇదే దారిలో ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. అదనపు చార్జీలు కారణంగా ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య పెరగడం కూడా ఈ చర్చను మరింత వేడెక్కిస్తోంది.
Details
గంటల తరబడి ఉంటే అదనపు చార్జీలు వసూలు
ఇంతలో, ఎల్‌బీ నగర్ నుండి కూకట్‌పల్లి వరకు నిత్యం మెట్రోలో ప్రయాణించే ఒక ప్రయాణికుడు.. మెట్రో ప్రాంగణంలో వాణిజ్య కార్యకలాపాలు అదుపులో ఉంటే, ఎవరూ అక్కడ గంటల తరబడి ఉండరు. అప్పుడు అదనపు చార్జీల అవసరమే ఉండదని అభిప్రాయపడ్డారు. ఈ నిబంధన పాతదే అయినప్పటికీ, తాజాగా అదనపు వసూళ్లు పెరగడంతో ప్రయాణికులు రెండు గంటల పరిమితి గురించి మరింత ఆందోళన చెందుతున్నారు.