న్యూఇయర్ అలర్ట్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్‌ల సస్పెండ్
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో కఠిన ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి 10గంటల నుంచి జనవరి 1వ తేదీ ఉదయం 5గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. ఓఆర్ఆర్, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే రాత్రి 10గంట నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేస్తారు. విమానాశ్రయాలకు వెళ్లేవారు టికెట్లు చూపించి వెళ్లవచ్చు. శిల్పా లేఅవుట్, గచ్చిబౌలి, బయో-డైవర్సిటీ, షేక్‌పేట్, మైండ్‌స్పేస్, రోడ్ నెం 45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, సైబర్ టవర్, ఫోరమ్ మాల్-జెఎన్‌టీయూ, కైతాలాపూర్ రాంజీవన్, బాలానగర్‌ఫ్లై ఓవర్లను మూసివేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెన్షన్ కోసం రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీకి పంపుతారు.
అన్ని పత్రాలను దగ్గర ఉంచుకోవాలి..
క్యాబ్, ట్యాక్సీ, అటో డ్రైవర్లు యూనిఫాంతో పాటు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను దగ్గర ఉంచుకోవాలి. ఏ ఒక్క రైడ్‌ను డ్రైవర్లు నిరాకరించకూడదు. ఈ విషయంలో ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతై.. తమ ఫిర్యాదులను 9490617346 వాట్సాప్ నెంబర్‌కు పంపవచ్చు. నగరంలోని ప్రధాన కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ ఏర్పాటు చేయనున్నారు. వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించకపోతే.. ఆ బండిని పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, మితిమీరిన హారన్‌లు, ప్రమాదకరమైన డ్రైవింగ్, ట్రిపుల్, మల్టిపుల్ రైడింగ్, ఇతర నేరాలపై కూడా పోలీసులు తగిన కేసులు నమోదు చేయనున్నారు.