US: బీచ్‌లో అదృశ్యమైన సుదీక్ష.. చివరిసారి చూసిన వ్యక్తిపై అనుమానాలు!
ఈ వార్తాకథనం ఏంటి
డొమినికన్ రిపబ్లిక్‌లోని పుంటా కానా బీచ్‌లో విహారయాత్రకు వెళ్లిన భారతీయ విద్యార్థిని సుదీక్ష కోనంకి వారం రోజులుగా కనిపించకుండా పోయింది.
ఐదుగురు స్నేహితులతో కలిసి రియు రిపబ్లికా రిసార్ట్‌లో ఎంజాయ్ చేస్తూ, మార్చి 4న హఠాత్తుగా మాయమైంది. స్నేహితుల సమాచారంతో అధికారులు రంగంలోకి దిగి, హెలికాప్టర్లు, పడవలు ఉపయోగించి గాలింపు చేపట్టారు.
అధికారుల పరిశీలన ప్రకారం, సుదీక్ష తెల్లవారుజామున 3 గంటలకు రిసార్ట్ డిస్కోలో ఉంది. అనంతరం 4 గంటలకు బీచ్‌కు వెళ్లింది. ఉదయం 5:50 గంటలకు స్నేహితులు ఆమెను ఒంటరిగా వదిలి వెళ్లిపోయారు.
ఆ సమయంలో ఆమె మైకంలో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఒక వ్యక్తి ఆమె స్పృహ తప్పి పడిపోయినట్లు చూసినట్లు, ఆమె వాంతి చేసుకున్నట్లు వెల్లడించాడు.
Details
కిడ్నాప్ అనుమానాలు
సుదీక్ష తల్లిదండ్రులు తమ కుమార్తె కిడ్నాప్‌కు గురై ఉండొచ్చని ఆరోపిస్తున్నారు.
ఆమె చివరిసారిగా కనిపించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నప్పటికీ, అతడిపై కిడ్నాప్ అనుమానాలను ఇంకా ధృవీకరించలేదు.
మరోవైపు బీచ్ ఒడ్డున ఆమె దుస్తులు లభించాయి, కేవలం బికినీ మాత్రమే మిగిలి ఉంది. భారీ కెరటం ఆమెను బీచ్‌లోకి లాక్కెళ్లి ఉండొచ్చన్న అనుమానాలున్నాయి.
అయితే అలాంటి ఘటన జరిగి వారం కావొస్తున్నా మృతదేహం బయటపడకపోవడం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది.
Details
తీవ్రంగా గాలింపు చర్యలు
డొమినికన్ రిపబ్లిక్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జువాన్ సలాస్ ప్రకారం, ఆమె సజీవంగా కనిపించే అవకాశాలు చాలా తక్కువ. డ్రోన్లు, హెలికాప్టర్లు, పడవల సహాయంతో విస్తృతంగా గాలింపు కొనసాగుతోంది.
సుదీక్ష కోనంకి వర్జీనియాలోని సౌత్ రైడింగ్‌కు చెందిన యువతి. ఆమె పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ-మెడిసిన్ చదువుతోంది.
అదృశ్యమైన సమయంలో, ఆమె గోధుమ రంగు బికినీ, పెద్ద గుండ్రని చెవిపోగులు, మెటల్ డిజైనర్ చీలమండ, కుడి చేతిపై పసుపు-స్టీల్ బ్రాస్‌లెట్‌లు, ఎడమ చేతిపై బహుళ వర్ణ పూసల బ్రాస్‌లెట్ ధరించి ఉన్నట్లు గుర్తించారు.
ఈ ఘటనపై అధికారులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.