Telangana: ఎండల ఎఫెక్ట్.. తెలంగాణలో బీర్ల సేల్స్ జోరు.. గత ఏడాదితో పోలిస్తే భారీ పెరుగుదల
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. రోజురోజుకీ గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతూ చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఈ వేడి ప్రభావంతో రాష్ట్రంలో బీర్ల విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు మందుబాబులు బీర్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా ఈ సమ్మర్‌లో బీర్ సేల్స్ భారీగా పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున బీర్ల డిమాండ్ ఇంకా పెరుగుతుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కొరత తలెత్తకుండా కంపెనీలు ఉత్పత్తిని పెంచుతున్నాయి. సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
వివరాలు
ఈసారి దాదాపు 30 శాతం పెరుగుదల
గతేడాదితో పోలిస్తే ఈసారి బీర్ విక్రయాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. ఈ ఏడాది మార్చిలోనే 50.78 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. గతేడాది మార్చిలో 39.05 లక్షల కేసులు మాత్రమే విక్రయమవగా, ఈసారి దాదాపు 30 శాతం పెరుగుదల నమోదైంది. ధరలు పెరిగినా కూడా వేడి నుంచి ఉపశమనం కోసం చల్లని బీర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. దీంతో ఎక్సైజ్ శాఖ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఇక ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL) విక్రయాలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. గతేడాది మార్చిలో 31.46 లక్షల కేసులు అమ్ముడవగా, ఈసారి 30.67 లక్షల కేసులకు తగ్గాయి.
వివరాలు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వానికి రూ.3,485 కోట్లు
అంటే సుమారు 2.5 శాతం తగ్గుదల నమోదైంది. మొత్తం మీద మార్చిలో మద్యం విక్రయాలు రూ.3,845 కోట్లకు చేరాయి. మార్చి 31ఒక్కరోజే రూ.410.87 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఇదే సమయంలో బీర్ సేల్స్ భారీగా పెరిగినా, IMFLసేల్స్ తగ్గడం గమనార్హం. ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వానికి రూ.3,485 కోట్ల ఆదాయం లభించగా, గతేడాది ఇదే సమయంలో రూ.3,126 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే సుమారు 11.49 శాతం వృద్ధి నమోదైంది. భానుడు తీవ్రత పెరుగుతున్న కొద్దీ IMFL కంటే బీర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. జూన్ వరకు ఎండల ప్రభావం కొనసాగనున్న నేపథ్యంలో బీర్ విక్రయాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.