HYDRAA : సున్నం చెరువు రూపురేఖలు మారిపోతున్నాయ్.. బోటింగ్, ప్లే ఏరియాలు, సోలార్ లైట్లతో కొత్త లుక్!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉన్న బోరబండ బస్తీ వాసుల ఆశలకు ఇప్పుడు కొత్త ఊపిరి వస్తోంది. మాదాపూర్ గుట్టల బేగంపేట పరిధిలో దశాబ్దాలుగా మురుగు కూపంగా మారిన 'సున్నం చెరువు'కు హైడ్రా (HYDRAA)కొత్త రూపు తీసుకొస్తోంది. అక్రమ ఆక్రమణలు, విష రసాయనాల వ్యర్థాలతో దుర్భరంగా మారిన ఈ చెరువును ఆధునిక సౌకర్యాలతో కూడిన పర్యాటక జలధారగా అభివృద్ధి చేస్తోంది. ఆక్రమణల కారణంగా ఒక దశలో కేవలం 14.20ఎకరాలకు పరిమితమైన చెరువు విస్తీర్ణాన్ని హైడ్రా ఏకంగా 30.5 ఎకరాలకు పెంచింది. చుట్టుపక్కల నివాసాలకు ఇబ్బంది కలగకుండా చెరువు అభివృద్ధి పనులు చేపడుతోంది. గతంలో ఇక్కడి ట్యాంకర్ల నీటిలో పాదరసం, సీసం, ఆర్సెనిక్ వంటి ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరించింది.
వివరాలు
మురుగు, వ్యర్థాల తొలగింపు.. ఆహ్లాదకర వాతావరణం
దీంతో ఈ ప్రాంతంలో కొనసాగుతున్న మురుగు నీటి దందాకు అధికారులు శాశ్వతంగా అడ్డుకట్ట వేశారు.
సున్నం చెరువులో దశాబ్దాలుగా పేరుకుపోయిన దాదాపు మూడు మీటర్ల లోతు వరకు ఉన్న ప్లాస్టిక్, ఘన వ్యర్థాలను హైడ్రా తొలగించింది.
దీంతో ఇన్నాళ్లుగా ఉన్న దుర్గంధం తగ్గిపోయింది. చెరువు చుట్టూ నిర్మించిన వాకింగ్ ట్రాక్‌ను ఇప్పటికే స్థానికులు ఉదయం, సాయంత్రం వేళల్లో వినియోగిస్తున్నారు. చెరువు పునర్నిర్మాణ పనులు త్వరలో పూర్తికానున్నాయి.
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేదలకు సీఎం చేతుల మీదుగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అందించి గౌరవప్రదమైన జీవితం కల్పించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.
వివరాలు
ఆంజనేయ స్వామి ఆలయానికి కొత్త శోభ
చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిరుపయోగంగా, చెత్తాచెదారం మధ్య ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా హైడ్రా అభివృద్ధి చేస్తోంది.
ఆలయ కమిటీ ప్రతినిధులతో పలుమార్లు సమావేశమై వారి సూచనలను తీసుకుంది. ఇందులో భాగంగా దివ్యమైన గోపురాన్ని నిర్మించడంతో పాటు భక్తులు ప్రదక్షిణలు చేసుకునేందుకు ప్రత్యేక పాత్‌వే ఏర్పాటు చేస్తున్నారు.
భక్తులు కూర్చునేందుకు పాలరాతి గజబోను, ఆలయం ముందు నీటి ఫౌంటెన్‌లో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
అయితే కొందరు స్వార్థపరులు ఆలయాన్ని సాకుగా చేసుకుని అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, గుడిని తొలగిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆలయ కమిటీ తెలిపింది.
ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని స్పష్టం చేసింది.
వివరాలు
బోటింగ్ నుంచి ప్లే ఏరియాల వరకు..
సున్నం చెరువు పరిసరాలను సరికొత్త పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు హైడ్రా ప్రణాళికలు రూపొందించింది.
విశాలమైన బండ్, నడకకు అనువైన పాత్‌వే, మార్గమధ్యంలో రాతి కుర్చీలు, పిల్లల కోసం ప్రత్యేక ప్లే ఏరియాలు, పచ్చిక బయళ్లు, ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేస్తోంది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఔషధ, సుగంధ మొక్కలతో పాటు పెద్ద చెట్లను నాటుతున్నారు. ఈ చర్యల ద్వారా పరిసరాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2-3 డిగ్రీలు తక్కువగా ఉండేలా ప్రణాళికలు రూపొందించారు.
మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు ప్రత్యేకంగా బేబీ పాండ్, చెరువులో బోటింగ్ సౌకర్యం, చుట్టూ సోలార్ లైట్లు, భద్రత కోసం పటిష్ఠమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. చెరువుకు ఆనుకుని ఉన్న సహజసిద్ధమైన కొండ ప్రాంతాన్ని కూడా సుందరీకరిస్తున్నారు.