Permanent Commission: సైన్యంలో లింగ సమానత్వానికి మద్దతు.. మహిళా ఆఫీసర్లకు గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
సైనిక దళాల్లో పర్మనెంట్ కమిషన్ అంశంపై ఈరోజు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మహిళా మిలిటరీ ఆఫీసర్లు కూడా పర్మనెంట్ కమిషన్‌కు అర్హులని స్పష్టం చేసింది. ఈ కేసులో కోర్టు తన అసాధారణ అధికారాలను వినియోగిస్తూ షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) కింద నియమితులైన మహిళా అధికారులకు పర్మనెంట్ కమిషన్ ఇవ్వాల్సిందేనని తీర్పులో పేర్కొంది. మిలిటరీ ప్రమోషన్ వ్యవస్థలో ఉన్న లోపాలను కూడా కోర్టు తీవ్రంగా ఎత్తిచూపింది. మహిళా ఎస్‌ఎస్‌సీ అధికారులకు పర్మనెంట్ కమిషన్ ఇవ్వకపోవడం విధాన పరమైన లోపమని పేర్కొంది. ప్రతేడాది కేవలం 250 మంది మహిళా అధికారులకు మాత్రమే పర్మనెంట్ కమిషన్ ఇవ్వాలన్న నిబంధనను కోర్టు కొట్టివేసింది. ఆ నిర్ణయం ఏకపక్షంగా ఉందని, న్యాయసమ్మతంగా లేదని స్పష్టం చేసింది.
వివరాలు
రిటైర్మెంట్ వయస్సు వరకు విధులు నిర్వహించే అవకాశం
సుప్రీంకోర్టు తాజా తీర్పు సైన్యంలో లింగ సమానత్వానికి బలమైన సంకేతంగా భావిస్తున్నారు. పర్మనెంట్ కమిషన్ పొందిన మహిళా అధికారులు రిటైర్మెంట్ వయస్సు వరకు విధులు నిర్వహించే అవకాశం పొందనున్నారు. ఇంతకుముందు సైన్యంలో ఉన్నత పదవులు ప్రధానంగా పురుషులకే పరిమితమయ్యేవి. అయితే ఈ తీర్పుతో మహిళలకు కూడా అత్యున్నత హోదాలకు ఎదగడానికి మార్గం సుగమమైంది. పర్మనెంట్ కమిషన్‌పై పురుషులకే హక్కు ఉందన్న భావనను కూడా కోర్టు ఖండించింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మహిళా అధికారులపై కొనసాగుతున్న వివక్షను విధాన రూపకల్పనలోని లోపంగా అభివర్ణించారు. మహిళా అధికారుల వార్షిక విశ్వసనీయ నివేదికలు (ACR) విషయంలో కూడా మిలిటరీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కోర్టు గమనించింది.