Delimitation Bill: డీలిమిటేషన్‌కు మద్దతిస్తే ప్రజా తీర్పును వంచించినట్లే.. సీజేపీ సంచలన వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరించిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు మద్దతు ఇవ్వడం ప్రజా తీర్పును ఘోరంగా వంచించడమేనని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అభిప్రాయపడింది. నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న 131వ రాజ్యాంగ సవరణ బిల్లును విపక్ష పార్టీలన్నీ ఐక్యంగా వ్యతిరేకించాలని కోరింది. పార్లమెంట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను దేశ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని పేర్కొంది. అధికార పక్ష కుతంత్రాలకు మద్దతుగా నిలిచే నేతలను, పార్టీలను చరిత్ర ఎప్పటికీ క్షమించదని స్పష్టం చేసింది. అభిజీత్ దిప్కే నేతృత్వంలోని ఈ యువజన ఉద్యమ వేదిక.. డీలిమిటేషన్ వెనుక ఉన్న అసలైన ప్రమాదం 'గెర్రీమాండరింగ్' అని ఆరోపించింది.
వివరాలు
సరిహద్దులను విభజించే ప్రమాదం
అంటే అధికార పార్టీకి అనుకూలంగా నియోజకవర్గాల సరిహద్దులను అక్రమంగా మార్చడమని వివరించింది.
పోలింగ్ బూత్ స్థాయి గణాంకాలు, ఓటరు జాబితాలు, గత ఎన్నికల ఓటింగ్ సరళిని ఉపయోగించుకుని బీజేపీకి శాశ్వత రాజకీయ ప్రయోజనం కలిగేలా నియోజకవర్గాల సరిహద్దులను విభజించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
తగిన స్వతంత్ర పర్యవేక్షణ, రక్షణ చర్యలు లేకుండా సరిహద్దులను తిరిగి గీస్తే.. భవిష్యత్తులో ఎన్నికల్లో ప్రజాభిప్రాయం మారినా, దాని ప్రభావం సభలో ప్రతిబింబించకుండా పోతుందని పేర్కొంది.
వివరాలు
డీఎంకే, ఎన్సీపీ వైఖరిపై అభ్యంతరం
డీఎంకే, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) వంటి పార్టీలు తమ వైఖరిని మార్చుకుని డీలిమిటేషన్ బిల్లుకు అనుకూలంగా సంకేతాలు ఇవ్వడంపై సీజేపీ కో-కన్వీనర్లు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా లోక్‌సభ సీట్లు 50 శాతం పెరుగుతాయనే కారణంతో ఆయా పార్టీలు బిల్లుకు మద్దతు ఇస్తున్నాయని విమర్శించారు.
అయితే అసోంలో గతంలో జరిగిన నియోజకవర్గాల సరిహద్దుల మార్పులను పరిశీలిస్తే.. గెర్రీమాండరింగ్ వల్ల ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందో అర్థమవుతుందని హెచ్చరించారు.
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ విలువలపై రాజీపడితే భవిష్యత్ తరాలు, దేశ యువత తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాలు
మహిళా రిజర్వేషన్ల పేరుతో సరిహద్దుల మార్పా?
మహిళా రిజర్వేషన్ల ముసుగులో కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల సరిహద్దులను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తోందని సీజేపీ ఆరోపించింది.
మహిళా రిజర్వేషన్ చట్టం ఇప్పటికే ఆమోదం పొందినప్పటికీ అమలుకు నోచుకోలేదని గుర్తుచేసింది.
దానిని సాకుగా చూపి ఎన్నికల మ్యాప్‌ను మార్చడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని స్పష్టం చేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రజల విశ్వసనీయతను కోల్పోయిందని ఆరోపించిన సీజేపీ.. అలాంటి వ్యవస్థ చేతుల్లో నియోజకవర్గాల పునర్విభజన బాధ్యతలు పెడితే ప్రజాస్వామ్యానికి పెను ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.