Supreme Court: ఇంటి రుణాల వసూలుకు ముందు కొనుగోలుదారుల తప్పిదాలను నిర్ధారించాలి: సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
అసంపూర్తిగా మిగిలిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టుల కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఫ్లాట్ల కొనుగోలుదారులకు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చింది. బిల్డర్లు, బ్యాంకు అధికారుల మధ్య కుమ్మక్కు ఉందా? లేదా? అనే విషయాన్ని ముందుగా పరిశీలించకుండా ఇంటి రుణ వాయిదాలు (ఈఎంఐలు) చెల్లించాలంటూ కొనుగోలుదారులపై ఒత్తిడి చేయకూడదని స్పష్టం చేసింది. ఈ విషయంలో కమర్షియల్ కోర్టులు, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ), నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)లకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
వివరాలు
నిర్మాణానికి అనుగుణంగానే రుణాలు ఇచ్చారో లేదో కోర్టులు పరిశీలించాలి
దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న రహేజా డెవలపర్స్‌కు చెందిన కృష్ణా హౌసింగ్ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది.
కొనుగోలు చేసిన ఫ్లాట్లు ఇప్పటికీ తమకు అందకపోయినా, రుణ బకాయిల వసూలు కోసం బ్యాంకులు ఢిల్లీలోని సాకేత్ కమర్షియల్ కోర్టులో చర్యలు ప్రారంభించాయి.
దీంతో బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రాజెక్టులో నిర్మాణ పనులు ఎంతవరకు పూర్తయ్యాయో పరిశీలించి, ఆ పురోగతికి అనుగుణంగానే బ్యాంకులు బిల్డర్‌కు రుణ మొత్తాన్ని విడుదల చేశాయా? లేదా? అన్న విషయాన్ని కోర్టులు ముందుగా నిర్ధారించాలని స్పష్టం చేసింది.
వివరాలు
నిర్మాణానికి అనుగుణంగానే రుణాలు ఇచ్చారో లేదో కోర్టులు పరిశీలించాలి
కొనుగోలుదారుల వైపు తప్పిదం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలతో నిర్ధారణ కాకుండా,ఈఎంఐలు చెల్లించాలంటూ వారిపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయకూడదని ధర్మాసనం పేర్కొంది.
సాధారణంగా త్రైపాక్షిక ఒప్పందాల ప్రకారం నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయో దానికి అనుగుణంగా బ్యాంకులు బిల్డర్లకు నిధులు విడుదల చేయాలి.
అయితే కొన్ని సందర్భాల్లో నిర్మాణ పనులు ప్రారంభం కాకముందే లేదా తగినంత పురోగతి లేకుండానే బ్యాంకులు రుణ మొత్తాలను విడుదల చేస్తున్నాయి.
దీంతో అనేక గృహ నిర్మాణ ప్రాజెక్టులు ఏళ్ల తరబడి అసంపూర్తిగా మిగిలిపోతున్నాయి.
ఫలితంగా కొనుగోలుదారులు ఒకవైపు అద్దె ఇంటి కోసం డబ్బులు చెల్లిస్తూనే,మరోవైపు సొంతింటి కోసం తీసుకున్న రుణానికి ఈఎంఐలు కూడా కట్టాల్సి వస్తోంది.
వివరాలు
బెంగళూరుకు చెందిన మరో కేసులోనూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఈ పరిస్థితి వారిని తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతోందని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఇదే తరహాలో బెంగళూరుకు చెందిన మరో కేసులోనూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
అక్కడ దాదాపు 4,500 మంది ఫ్లాట్ల కొనుగోలుదారులు ఇంటి ధరలో 95 శాతం వరకు చెల్లించినప్పటికీ, పదేళ్లుగా నిర్మాణ ప్రాజెక్టు పూర్తికాలేదు.
దీంతో బాధిత కొనుగోలుదారులకు బ్యాంకుల రుణ వసూలు చర్యల నుంచి రక్షణ కల్పించింది.
ఈ తరహా గృహ నిర్మాణ వివాదాలపై గతేడాది సెప్టెంబరులోనే సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
బిల్డర్లు, బ్యాంకుల వ్యవహారశైలిపై దేశవ్యాప్తంగా సీబీఐ విచారణ చేపట్టాలని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే.