Loading...
SC Status: ఎస్సీ హోదా కొనసాగాలంటే ఇవే షరతులు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఎస్సీ హోదా కొనసాగాలంటే ఇవే షరతులు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

SC Status: ఎస్సీ హోదా కొనసాగాలంటే ఇవే షరతులు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 27, 2026
01:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

మత మార్పిడి అనంతరం షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా కొనసాగింపుపై సుప్రీంకోర్టు మరోసారి కీలక స్పష్టత ఇచ్చింది. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను విడిచి ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులు ఎస్సీ హోదాను కొనసాగించలేరని సర్వోన్నత న్యాయస్థానం పునరుద్ఘాటించింది. ఈ అంశంపై మార్చి 2026లో వెలువరించిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. సుప్రీంకోర్టు పేర్కొన్న వివరాల ప్రకారం, క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదని ఇప్పటికే ఇచ్చిన తీర్పులో ఎలాంటి మార్పు అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో మార్చి 2026లో ఇచ్చిన తీర్పు యథాతథంగా కొనసాగుతుందని వెల్లడించింది.

వివరాలు 

ఎస్సీ హోదా పునరుద్ధరణకు తప్పనిసరి షరతులు

అయితే, క్రైస్తవం లేదా ఇతర మతాల్లోకి మారిన వ్యక్తి తిరిగి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాన్ని స్వీకరిస్తే, నిర్దిష్ట నిబంధనలను పూర్తి చేసిన పక్షంలో ఎస్సీ హోదా పునరుద్ధరణకు అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఇందుకు మూడు కీలక షరతులు తప్పనిసరిగా నెరవేరాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఎస్సీ హోదా పునరుద్ధరణకు తప్పనిసరి షరతులు ఇవే..

వ్యక్తి జన్మతః షెడ్యూల్డ్ కులానికి చెందినవారై ఉండాలి.

హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాన్ని నిజమైన ఉద్దేశంతో తిరిగి స్వీకరించి ఉండాలి.

సంబంధిత అసలు షెడ్యూల్డ్ కులం ఆ వ్యక్తిని మళ్లీ తమ సభ్యుడిగా అంగీకరించి ఉండాలి.

వివరాలు 

2026లో వెలువరించిన తీర్పు యథాతథంగా అమల్లో..

ఈ మూడు షరతుల్లో ఏ ఒక్కటి నెరవేరకపోయినా ఎస్సీ హోదాను పునరుద్ధరించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఒక కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం, రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించడం ద్వారా మార్చి 2026లో వెలువరించిన తీర్పు అమల్లోనే కొనసాగుతుందని మరోసారి తేల్చిచెప్పింది.

ADVERTISEMENT