వైఎస్ వివేక హత్య కేసులో స్వయంగా వాదనలు వినిపించిన సునీతారెడ్డి.. ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం నోటీసులు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ మేరకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి నోటీసులను జారీ చేసింది. అవినాశ్ రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ సునీతా దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం వాయిదా వేస్తూ అవినాశ్ రెడ్డికి, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. సునీత పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మే 31న తెలంగాణ హైకోర్టు అవినాశ్ రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్ ఆర్డర్స్ ను వివేకా కుమార్తె సునీతా గతంలోనే సుప్రీంలో సవాల్ చేశారు.
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందుకు చేరిన తదుపరి విచారణ
వైఎస్ సునీతా వేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం, తదుపరి విచారణను జులై 3కి వాయిదా వేసింది. అంతే కాకుండా తదుపరి వాయిదాను విచారించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ వద్ద లిస్ట్ చేసింది. ఎంపీ అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ గత మంగళవారం సునీతా దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో హతుడు వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి స్వయంగా ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ఆమెకు సుప్రీం సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సహకరించేందుకు కోర్టు అనుమతివ్వడం గమనార్హం.