Supreme Court: సెక్స్ వర్కర్ల హక్కులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
లైంగిక వృత్తికి సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్వచ్ఛందంగా లైంగిక వృత్తిని ఎంచుకున్న వ్యక్తులు, మానవ అక్రమ రవాణా ద్వారా బలవంతంగా ఈ రంగంలోకి నెట్టబడిన బాధితులు ఒకే వర్గం కాదని స్పష్టం చేసింది. ఈ రెండు వర్గాల మధ్య ఉన్న తేడాను గుర్తించి చట్ట అమలు సంస్థలు వ్యవహరించాలని సూచించింది. ఈ నేపథ్యంలో పలు ముఖ్యమైన మార్గదర్శకాలను జారీ చేసింది. స్వచ్ఛందంగా లైంగిక వృత్తిలో కొనసాగుతున్న మేజర్లపై పోలీసులు దాడులు నిర్వహించడం,కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. కేవలం ఈ వృత్తిలో ఉన్నారనే కారణంతో వారిని వేధించడం లేదా వివక్ష చూపడం సమంజసం కాదని స్పష్టం చేసింది.
వివరాలు
వీరి ఫొటోలు, వీడియోలను ప్రసారం చేయడం నేరమని మీడియాకు హెచ్చరిక
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి గౌరవప్రదంగా జీవించే హక్కు ఉందని, ఆ హక్కు లైంగిక వృత్తిదారులకు కూడా సమానంగా వర్తిస్తుందని న్యాయస్థానం గుర్తు చేసింది. లైంగిక వృత్తిదారుల ఫొటోలు, దృశ్యాలు లేదా వారి వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయడం నేరంగా పరిగణించబడుతుందని మీడియాకు హెచ్చరికలు జారీ చేసింది. ఇతర పౌరుల మాదిరిగానే వారికి కూడా చట్టపరమైన రక్షణ కల్పించాలని అధికారులను ఆదేశించింది.
వివరాలు
సెక్స్ వర్కర్లు అందరికీ ఆధార్ కార్డులు జారీ చేయాలని యూఐడీఏఐని ఆదేశించింది
అదేవిధంగా, నివాస ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా సెక్స్ వర్కర్'లకు ఆధార్ కార్డులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థకు సూచించింది. గుర్తింపు పత్రాల లేమి కారణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు వారికి దూరం కాకూడదని పేర్కొంది. మరోవైపు, బలవంతపు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నేర ముఠాలపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది.