Air India Plane Crash: ఎయిర్ ఇండియా ప్రమాదం కేసు : కేంద్రం, డీజీసీఏకి సుప్రీంకోర్టు నోటీసులు
ఈ వార్తాకథనం ఏంటి
గత జూన్‌లో అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన కేసులో, కేంద్ర ప్రభుత్వం, సివిల్ ఏవియేషన్ ప్రధాన నియంత్రణ సంస్థ (DGCA)కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై న్యాయ విచారణ జరపాలని కోరుతూ, ఆ విమానం నడిపిన పైలట్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తున్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రమాదం ఎందుకు జరిగింది? బాధ్యత ఎవరిది? అనేది స్పష్టంగా తేలడానికి స్వతంత్ర దర్యాప్తు అవసరమని పైలట్ తండ్రి పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణ సమయంలో జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి, జస్టిస్ జె. సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం, విమాన ప్రమాదంపై వాస్తవాలకు విరుద్ధంగా నివేదికలు రూపొందించడం పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
వివరాలు
పైలట్‌ను నిందించడం తగదు
ఈ విషాదానికి కారణంగా పైలట్‌ను నిందించడం తగదని స్పష్టంగా తెలిపింది. "ఇది విషాదకరమైన ప్రమాదం. ప్రాథమిక దర్యాప్తు నివేదికలో పైలట్ వైపు నుంచి తప్పిదం లేనట్లు స్పష్టమైంది. అందువల్ల, పైలట్‌ను తప్పుబట్టే విధంగా అపోహలకు దారి తీసే నివేదికలు చేయకూడదు. ఇటువంటి సంఘటనలపై దర్యాప్తు చేయడానికి స్పష్టమైన నియమాలు, విధానాలు ఉన్నాయి" అని జస్టిస్ బాగ్చి చెప్పారు. దివంగత పైలట్ తండ్రి వ్యక్తం చేసిన బాధ, న్యాయపరంగా నిష్పక్షపాతమైన దర్యాప్తు జరగాలనే అవసరాన్ని కోర్టు గమనించిందని ధర్మాసనం పేర్కొంది.
వివరాలు
ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి
పిటిషనర్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ మాట్లాడుతూ, " 'నియమం 11 అనేది ప్రమాదాలకు సంబంధించినది. కానీ, ఇప్పటివరకు కేవలం ప్రాథమిక దర్యాప్తు మాత్రమే నిర్వహించారు,ఇది నియమం 9 పరిధిలోకి వస్తుంది. నిజాలు వెలుగులోకి రావడానికి, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్వతంత్ర దర్యాప్తు కావాలి" అని కోర్టును కోరారు. ఈ ప్రమాదం 2025 జూన్ 12న మధ్యాహ్నం 1:38 గంటలకు అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI 171 టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలలోనే చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు సహా మొత్తం 265మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మరణించిన విషయం తెలిసిందే.