Supreme Court: విడాకుల భరణం నిర్ణయించడానికి సుప్రీంకోర్టు 8 మార్గదర్శకాలు జారీ
తన భార్య పెట్టిన వేధింపులను భరించలేక బెంగళూరులో టెక్కీ అయిన అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీసింది. అతడు రాసిన సూసైడ్ నోట్ సుప్రీంకోర్టుకు చేరాలని ఆశించాడు. ఈ ఘటన జరిగిన 48 గంటల్లోనే, వైవాహిక చట్టాల దుర్వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో విడాకుల సమయంలో తీసుకోవలసిన భరణం గురించి న్యాయస్థానం తగిన విధివిధానాలను ప్రకటించింది. మొత్తం 8 మార్గదర్శకాలను రూపొందించడమే కాక, కోర్టులకు విడాకుల కేసుల్లో భరణం నిర్ణయించేటప్పుడు వాటిని అనుసరించాలని సూచించింది. కేసు విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పీవీ వర్లేలు రూపొందించిన గైడ్‌లైన్స్ ప్రకారం, భరణం కింద ఇచ్చే నగదు విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.
తీర్పులో 8 కీలక అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి
ఈ మార్గదర్శకాల ఆధారంగా దేశవ్యాప్తంగా కోర్టులు విడాకుల కేసుల్లో భరణం నిర్ణయించాలని సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో 8 కీలక అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని ప్రకటించింది. విడాకుల సమయంలో శాశ్వత భరణం నిర్ణయించే విషయంలో ఈ అంశాలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పింది. తన భార్య నిఖిత సింఘానియాతో విడాకులు తీసుకునే సమయంలో 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం, అలాగే నెలకు రూ. 2 లక్షలు భరణంగా కోరడం వంటి విషయాలు అతుల్ సుభాష్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు 8 గైడ్ లైన్స్ జారీ చేయడం విశేషం.
సుప్రీంకోర్టు జారీ చేసిన 8 మార్గదర్శకాలు ఇవే..
1. భార్యాభర్తల సామాజిక ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడం. 2. భవిష్యత్తులో భార్య, పిల్లల ప్రాథమిక అవసరాలు ఏమిటో తెలుసుకోవడం. 3. ఇరువురి ఉద్యోగం, విద్యార్హతలు, ఆదాయం, ఆస్తుల వివరాలు తెలుసుకోవడం. 4.ఆదాయం, ఆస్తి సాధనాల వివరాలు సేకరించడం. 5. అత్తింట్లో భార్య జీవన ప్రమాణం ఎలా ఉందో తెలుసుకోవడం. 6.కుటుంబం కోసం భార్య ఉద్యోగాన్ని వదిలేసిందా అన్న విషయాన్ని తెలుసుకోవడం. 7.ఉద్యోగం చేయని భార్యకు న్యాయ పోరాటం కోసం తగిన మొత్తం అందించడం. 8. భర్త ఆర్థిక పరిస్థితి, ఆదాయం, భరణం, ఇతర బాధ్యతలు తెలుసుకోవడం.