Supreme Court: అలీఘర్ ముస్లిం యూనివర్శిటీపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ మైనార్టీ హోదా వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అలీఘర్ ముస్లిం యూనివర్శిటీకి మైనార్టీ హోదా ఉందని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4:3 మెజారిటీలో 2024, నవంబర్ 8 న ఈ తీర్పును వెలువరించింది. భారత రాజ్యాంగ ఆర్టికల్ 30 కింద మైనార్టీలకు ఉన్న ప్రత్యేక హక్కులు అలీఘర్ ముస్లిం యూనివర్శిటీలో వర్తిస్తాయని సుప్రీం కోర్టు వెల్లడించింది.
మైనార్టీ హోదా సాధ్యం కాదు 1967లో తీర్పు
1875లో స్థాపితమైన అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ మైనార్టీ హోదా పునరుద్ధరణకు పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు, 2024 ఫిబ్రవరి 1న తీర్పును రిజర్వ్ చేసింది. అనంతరం సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం 2024 నవంబర్ 8 న తీర్పును వెలువరించింది. 1967లో సుప్రీం కోర్టు అలీఘర్ ముస్లిం యూనివర్శిటీకి మైనార్టీ హోదా సాధ్యం కాదని ఇచ్చిన తీర్పును 4:3 మెజారిటీలో తిరస్కరించిందని ఈ కొత్త తీర్పులో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.