LOADING...
Supreme Court: 'సిక్స్త్‌ సెన్స్‌'తో అంచనా.. అత్యాచార కేసులో శిక్ష రద్దు చేసిన సుప్రీం కోర్టు
'సిక్స్త్‌ సెన్స్‌'తో అంచనా.. అత్యాచార కేసులో శిక్ష రద్దు చేసిన సుప్రీం కోర్టు

Supreme Court: 'సిక్స్త్‌ సెన్స్‌'తో అంచనా.. అత్యాచార కేసులో శిక్ష రద్దు చేసిన సుప్రీం కోర్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 27, 2025
01:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓ అత్యాచార కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలకమైన, ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అత్యాచార ఆరోపణల్లో దోషిగా తేలిన వ్యక్తి, బాధితురాలితో మొదట పరస్పర అంగీకారంతోనే సంబంధం కొనసాగించాడని, ఆ తర్వాత వారి మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా కేసు నమోదైనట్లు తమ పరిశీలనలోకి వచ్చిందని న్యాయమూర్తులు జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అపార్థాల వల్ల విడిపోయిన వ్యక్తులు మళ్లీ కలిసే అవకాశముందని తమ 'సిక్స్త్ సెన్స్' చెబుతోందని వ్యాఖ్యానించింది. అనంతరం బాధితురాలిని ఆ వ్యక్తి వివాహం చేసుకున్న నేపథ్యంలో అతడిపై నమోదైన ఫిర్యాదు, విధించిన శిక్షను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.

Details

ఇరువురి మధ్య విభేదాలు

పోలీసుల ఛార్జిషీట్‌ ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళకు 2015లో సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొంతకాలం పాటు ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే వివాహ అంశంలో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో తనను వివాహం చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగికంగా దాడి చేశాడని ఆరోపిస్తూ మహిళ 2021లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు ఆ వ్యక్తిని దోషిగా నిర్ధారించి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. బెయిల్‌ మంజూరు చేయాలని కోరగా హైకోర్టు తిరస్కరించడంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

Details

మధ్యంతర బెయిల్ మంజూరు

ఈ కేసుపై గతంలో సుప్రీంకోర్టు ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. ఆ సమయంలో బాధితురాలు, దోషి వివాహానికి సుముఖత వ్యక్తం చేయడంతో, జులై నెలలో వివాహం చేసుకునేందుకు అతడికి మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. తాజాగా కేసుపై జరిగిన విచారణలో ప్రస్తుతం ఆ జంట సంతోషంగా దాంపత్య జీవితం సాగిస్తున్నారని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, అతడిపై ఉన్న అత్యాచార కేసును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే గతంలో అతడు ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన ఉద్యోగంలోనే తిరిగి నియమించాలని మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement