LOADING...
Supreme Court: బాధితురాలినే పెళ్లి చేసుకున్న నిందితుడు.. ప్రత్యేక అధికారంతో పోక్సో కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు
ప్రత్యేక అధికారంతో పోక్సో కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు

Supreme Court: బాధితురాలినే పెళ్లి చేసుకున్న నిందితుడు.. ప్రత్యేక అధికారంతో పోక్సో కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2026
02:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రేమ, విభేదాలు, జైలు శిక్ష, ఆ తర్వాత అనూహ్య పరిణామాలతో సాగిన ఓ విచిత్రమైన కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఉన్న అసాధారణ అధికారాలను వినియోగించిన అత్యున్నత న్యాయస్థానం, ఒక వ్యక్తిపై నమోదైన పోక్సో కేసుతో పాటు అతడికి విధించిన పదేళ్ల జైలు శిక్షను రద్దు చేసింది. బాధితురాలు మేజర్ అయిన తర్వాత అదే వ్యక్తిని వివాహం చేసుకుని ప్రస్తుతం భార్యాభర్తలుగా జీవిస్తుండటాన్ని కోర్టు ప్రత్యేక పరిస్థితిగా పరిగణించింది.

వివరాలు 

కేసు నేపథ్యం ఇదే..

బాధితురాలు, నిందితుడు ఇద్దరూ ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల నుంచే ప్రేమించుకున్నారు. ఆ సమయంలో వారి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. అనంతరం యువకుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. ఘటన జరిగిన సమయంలో ఆమె మైనర్ కావడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం దిగువ కోర్టు నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

వివరాలు 

జీవితంలో ఊహించని మలుపు

శిక్ష పడిన తర్వాత యువతికి మరో వ్యక్తితో వివాహం జరిగింది. అయితే, ఆమె గతం గురించి తెలిసిన కొద్ది రోజులకే భర్త ఆమెను విడిచిపెట్టాడు. ఇదే సమయంలో బెయిల్‌పై బయటకు వచ్చిన మొదటి ప్రియుడు మళ్లీ ఆమెను సంప్రదించాడు. ఇద్దరూ గత విభేదాలను మరిచి పరస్పర అంగీకారంతో వివాహం చేసుకుని కలిసి జీవించడం ప్రారంభించారు. ప్రస్తుతం వారు భార్యాభర్తలుగా ఒకే ఇంట్లో సంసార జీవితం కొనసాగిస్తున్నారు.

Advertisement

వివరాలు 

హైకోర్టులో నిరాశ.. సుప్రీంకోర్టులో ఉపశమనం

తమ దాంపత్య జీవితానికి పాత కేసు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో మహిళ తన భర్తకు విధించిన శిక్షను రద్దు చేయాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, పోక్సో వంటి తీవ్రమైన నేరాల్లో కేసును రద్దు చేసే అవకాశం లేదని పేర్కొంటూ హైకోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఆ దంపతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Advertisement

వివరాలు 

ఆర్టికల్ 142తో సంపూర్ణ న్యాయం

ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, దంపతుల ప్రస్తుత పరిస్థితులు, వారి భవిష్యత్తు, కుటుంబ జీవితం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది. కేసు వాస్తవాలపై మళ్లీ విచారణ చేపట్టకుండా, ప్రత్యేక పరిస్థితుల్లో పూర్తి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించి,నిందితుడిపై నమోదైన పోక్సో కేసుతో పాటు పదేళ్ల జైలు శిక్షను రద్దు చేస్తున్నామని, అతడిని నిర్దోషిగా ప్రకటిస్తున్నామని ధర్మాసనం వెల్లడించింది. అయితే, ఈ తీర్పు పూర్తిగా ఈ కేసులోని అసాధారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇచ్చిందని, భవిష్యత్తులో ఇలాంటి ఇతర పోక్సో కేసులకు దీనిని న్యాయపరమైన ఉదాహరణగా పరిగణించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Advertisement