Supreme Court : చిరునామా మారితే పేరు తొలగిస్తారా.. ఈసీకి సుప్రీంకోర్టు చీవాట్లు
ఈ వార్తాకథనం ఏంటి
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. గడువులోగా దరఖాస్తు సమర్పించలేదనే కారణంతో ఓటర్ల పేర్లను తొలగించడం సమంజసమేనా అని నిలదీసింది. ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలను ఎందుకు పూర్తి చేసి సమర్పించలేకపోయారో ఆలోచించారా అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహన్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.
వివరాలు
చిరునామా మారితే కొత్త ఓటరుగా పరిగణిస్తారా?
చిరునామా మారిన ఓటర్లు కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారి మాదిరిగా ఫారం-6 నింపి సమర్పించాలని ఆదేశించడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది.
నగరాల్లో పనిచేసే దినసరి కూలీలు తరచూ నివాసాలు మారుస్తుంటారని పేర్కొంది.
అలాంటి వారికి తమ ఓటరు కార్డు వివరాలు, పోలింగ్ బూత్ నంబర్లు ఎప్పుడూ గుర్తుండటం సాధ్యం కాదని వ్యాఖ్యానించింది.
ఓటర్ల జాబితాలో పేర్లను తిరిగి చేర్చే ప్రక్రియను సులభతరం చేయాలని ఎన్నికల సంఘానికి సూచించింది.
వివరాలు
ఓటర్ల వద్దకే వెళ్లాలి
దిల్లీలో మొత్తం 1.45 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారిలో 47 లక్షల మందిని ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటర్లు తమ వద్దకు రావాలని ఆశించకుండా, ఎన్నికల సంఘమే వారి వద్దకు వెళ్లాలని సూచించింది.
చట్ట నిబంధనల ప్రకారం రూపొందించిన ఫారం-6, ఫారం-7, ఫారం-8లను ఎన్నికల సంఘం మార్చడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
ముసాయిదా జాబితా నుంచి పేర్లు తొలగించిన ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్ ఫారాలను స్వీకరించేందుకు గడువు విధించకూడదని పేర్కొంది.
వివరాలు
లక్షల మందికి నోటీసుల జారీపై పరిశీలన
ఓటర్ల పేర్లు, ఇతర వివరాల్లో తేడాలు ఉన్నాయనే కారణంతో సహేతుక వ్యత్యాసాల పేరుతో లక్షల మందికి నోటీసులు జారీ చేస్తున్న విధానం చట్టబద్ధతను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
పశ్చిమ బెంగాల్‌కు సంబంధించి ఈ అంశంపై తాత్కాలిక ఉత్తర్వులు మాత్రమే జారీ చేశామని ధర్మాసనం స్పష్టం చేసింది.