Loading...
Abu Salem: అబూ సలేంకు సుప్రీంకోర్టులో షాక్.. ముందస్తు విడుదల పిటిషన్ కొట్టివేత
అబూ సలేంకు సుప్రీంకోర్టులో షాక్.. ముందస్తు విడుదల పిటిషన్ కొట్టివేత

Abu Salem: అబూ సలేంకు సుప్రీంకోర్టులో షాక్.. ముందస్తు విడుదల పిటిషన్ కొట్టివేత

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2026
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ అబూ సలేంకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 25 ఏళ్ల జైలు శిక్ష పూర్తయిందని, జైలులో తన ప్రవర్తన ఆధారంగా లభించిన రెమిషన్‌ను కూడా లెక్కలోకి తీసుకుని తనను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యవహారంపై విచారణ జరిపింది. అబూ సలేం వాదనలను పరిశీలించిన అనంతరం అతని పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ విషయంలో గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

వివరాలు 

పోర్చుగల్‌కు ఇచ్చిన హామీని ప్రస్తావించిన సలేం

తనను పోర్చుగల్ నుంచి భారత్‌కు అప్పగించే సమయంలో భారత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తనకు 25 ఏళ్లకు మించి జైలు శిక్ష విధించకూడదని అబూ సలేం పిటిషన్‌లో పేర్కొన్నాడు.

విచారణ ఖైదీగా జైలులో గడిపిన కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరాడు.

అదేవిధంగా, జైలు నిబంధనల ప్రకారం తనకు లభించిన రెమిషన్‌ను కూడా కలిపి లెక్కిస్తే 25 ఏళ్ల శిక్ష ఇప్పటికే పూర్తయినట్లేనని సలేం వాదించాడు.

ప్రస్తుతం నాసిక్ రోడ్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయన.. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

వివరాలు 

2005లో భారత్‌కు అప్పగింత

1993 ముంబై పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న అబూ సలేంను 2005 నవంబర్‌లో పోర్చుగల్ నుంచి భారత్‌కు అప్పగించారు.

అనంతరం ఈ కేసును విచారించిన ప్రత్యేక టాడా కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది.

అయితే పోర్చుగల్‌కు భారత్ ఇచ్చిన హామీని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. 2022 జులైలో అబూ సలేంకు విధించిన జీవిత ఖైదును 25 ఏళ్ల జైలు శిక్షగా మార్చింది.

25 ఏళ్ల శిక్ష పూర్తయ్యే సమయానికి ఒక నెల ముందు రెమిషన్ అంశాన్ని పరిశీలించాలని అప్పట్లో కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

ADVERTISEMENT

వివరాలు 

రెమిషన్‌తో శిక్షను తగ్గించలేం

సుప్రీంకోర్టు నిర్ణయించిన 25 ఏళ్ల శిక్షను జైలు నిబంధనల ప్రకారం సాధారణంగా లభించే రెమిషన్‌తో తగ్గించే అవకాశం లేదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.

ఇది కోర్టు ప్రత్యేకంగా విధించిన అసలు శిక్ష అని పేర్కొంది. సాధారణ రెమిషన్‌ను లెక్కలోకి తీసుకుని ఈ శిక్షా కాలాన్ని తగ్గించడం చట్టపరంగా సాధ్యం కాదని తేల్చింది.

ADVERTISEMENT

వివరాలు 

2030 నవంబర్ వరకు జైలులోనే

అబూ సలేంను అరెస్టు చేసిన తేదీ 2005 నవంబర్ 11 నుంచి 25 ఏళ్ల కాలాన్ని లెక్కించాలని బాంబే హైకోర్టు గతంలో పేర్కొంది.

ఆ లెక్క ప్రకారం అతని 25 ఏళ్ల శిక్ష 2030 నవంబర్‌లో పూర్తవుతుంది.

బాంబే హైకోర్టు అభిప్రాయంతో ఏకీభవించిన సుప్రీంకోర్టు.. అబూ సలేం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

దీంతో ముందస్తుగా జైలు నుంచి విడుదల కావాలన్న అతని ఆశలకు బ్రేక్ పడింది. తాజా తీర్పు ప్రకారం అబూ సలేం 2030 వరకు జైలులోనే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

ADVERTISEMENT