Supreme Court: రెవెన్యూ రికార్డుల్లో పేర్లుంటే భూమిపై హక్కులున్నట్లు కాదు.. యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఈ వార్తాకథనం ఏంటి
ఖమ్మం జిల్లా పినపాక మండలం కాల్వలనాగారం గ్రామ పరిధిలోని సర్వే నంబరు-81లో రక్షిత అటవీ భూమిగా ప్రకటించిన 787 ఎకరాల్లో 600 ఎకరాలు తమవేనంటూ వడియాల ప్రభాకర్‌రావుతో పాటు మరో ఎనిమిది మంది చేసిన క్లెయిమ్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. రెవెన్యూ రికార్డులు, జమాబందీలు కేవలం ఆర్థిక అవసరాల కోసమే ఉంటాయని, వాటిలో పేరున్నవారికి భూమి శిస్తు చెల్లించే అవకాశం కల్పించడమే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేసింది. కాబట్టి రెవెన్యూ రికార్డులు హక్కు పత్రాలుగా పరిగణించలేమని, అవి యాజమాన్య హక్కును నిర్ధారించవని వెల్లడించింది. ఈ క్లెయిమ్‌ను తిరస్కరిస్తూ ఖమ్మం జాయింట్ కలెక్టర్ 2003 మే 19న జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది.
వివరాలు
హైకోర్టు విభాగ ధర్మాసనం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించిన సుప్రీం
ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం 2012 మార్చి 27న ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది. ఆ తప్పును సరిదిద్దుతూ హైకోర్టు విభాగ ధర్మాసనం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించింది. ఈ మేరకు న్యాయమూర్తులు పంకజ్ మిత్తల్, ఎస్‌వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పును న్యాయమూర్తి ఎస్‌వీఎన్ భట్టి రచించారు. భూ వివాదం మొత్తం అప్పీల్ దారుల పేర్లలో ఉన్న ఫైసల్ పట్టీ, వసూల్ బాకీ, పహాణీ రికార్డుల చుట్టూనే తిరుగుతోందని ధర్మాసనం పేర్కొంది. అయితే, ఆ భూములు తమవో, తమ పూర్వీకులవో అన్నదానికి సరైన హక్కు పత్రాలు చూపించలేకపోయారని తెలిపింది.
వివరాలు
అనుమానాస్పద నమోదు హక్కులకు ఆధారం కాదు
మున్సిపల్, వ్యవసాయ శిస్తులు చెల్లించడం లేదా రికార్డుల ఆధారంగా బ్యాంకు రుణాలు పొందడం వల్ల భూమిపై యాజమాన్య హక్కులు వస్తాయని భావించడం సరైంది కాదని, ప్రభుత్వ హక్కును సవాల్ చేయడాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేసింది. రెవెన్యూ రికార్డుల నిర్వహణ పూర్తిగా పట్వారీ ఆధీనంలో ఉంటుందని, అవసరాలను బట్టి వాటిలో మార్పులు జరిగే అవకాశముందని కోర్టు తెలిపింది. ఒకే ఏడాది నమోదైన అనుమానాస్పద ఎంట్రీల ఆధారంగా యాజమాన్య హక్కులు ఏర్పడవని పేర్కొంది. దీర్ఘకాలంగా కొనసాగిన రికార్డులకు వ్యతిరేకంగా అలాంటి ఎంట్రీలను ఆధారంగా తీసుకోలేమని వివరించింది.
వివరాలు
కాల్వలనాగారం సర్వే నంబరు-81 అడవిగా నమోదు
కోర్టు పరిశీలించిన పహాణీ ప్రకారం కాల్వలనాగారం సర్వే నంబరు-81 అడవిగా నమోదై ఉందని తెలిపింది. 1950 ఫిబ్రవరిలో 600 ఎకరాలను రక్షిత అటవీ ప్రాంతంగా ప్రకటించిన నోటిఫికేషన్ నుంచి తొలగించాలని అప్పీల్ దారులు 1990 నవంబరు 9న జాయింట్ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, హక్కులను నిరూపించే ప్రాథమిక పత్రాలు చూపలేకపోవడంతో ఆ దరఖాస్తును తిరస్కరించడం సరైనదేనని పేర్కొంది.
వివరాలు
హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పు ఇవ్వడం సరికాదు
అప్పీల్ దారులు సమర్పించిన పత్రాల్లో లోపాలున్నప్పటికీ వారికి భూమిపై హక్కు ఉందని హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పు ఇవ్వడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందుకే ఆ తీర్పును హైకోర్టు విభాగ ధర్మాసనం సరిదిద్దిందని తెలిపింది. అప్పీల్ దారుల క్లెయిమ్, వారు సమర్పించిన పత్రాలను పరిశీలించిన తర్వాత ఈ వివాదాన్ని ఇకపై అధికారులు లేదా కోర్టులు కొనసాగించాల్సిన అవసరం లేదని భావిస్తూ, హైకోర్టు విభాగ ధర్మాసనం తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.