Supreme Court: నీట్ రీఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు తీర్పు.. ఓఎంఆర్ విధానమే కొనసాగింపు
ఈ వార్తాకథనం ఏంటి
నీట్-యూజీ 2026 పునఃపరీక్ష నిర్వహణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. జూన్ 21న జరగనున్న రీఎగ్జామ్‌ను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షను ఓఎంఆర్ విధానంలోనే నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం, పరీక్షా విధానాన్ని చివరి నిమిషంలో మార్చడం సాధ్యంకాదని పేర్కొంది. పరీక్ష నిర్వహణకు అందుబాటులో ఉన్న సమయం చాలా తక్కువగా ఉండటంతో పాటు, నిర్వహణ బాధ్యతలు చేపట్టిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)పై అధిక పరిపాలనా భారం ఉందని గుర్తుచేసింది. ఈ పరిస్థితుల్లో విధాన మార్పులు అమలు చేయడం ఆచరణాత్మకంగా కష్టమని అభిప్రాయపడింది.
వివరాలు
ఈ దశలో అలాంటి మార్పులను అమలు చేయడం సాధ్యం కాదు: సుప్రీం
ఆర్‌జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌లో నీట్ పరీక్షా విధానంలో పలు సంస్కరణలను ప్రతిపాదించారు. పరీక్షను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించాలని, ప్రశ్నపత్రాల భద్రత కోసం ఎన్‌క్రిప్టెడ్ వ్యవస్థలను ఉపయోగించాలని కోరారు. అలాగే కృత్రిమ మేధస్సు ఆధారిత నిఘా వ్యవస్థలను అమలు చేయడం ద్వారా అవకతవకలను అరికట్టవచ్చని వాదించారు. ప్రస్తుత ఎన్‌టీఏ స్థానంలో స్వతంత్ర పరీక్షా నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. అయితే ఈ దశలో అలాంటి మార్పులను అమలు చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రకటించిన విధంగానే పునఃపరీక్షను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని ఆదేశించింది.
వివరాలు
వేసవి సెలవుల అనంతరం సుదీర్ఘ విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయం
పరీక్షా వ్యవస్థలో మార్పులు, సంస్కరణల అవసరాన్ని కోర్టు అంగీకరించినప్పటికీ,వాటిపై సమగ్ర పరిశీలన,విధానపరమైన నిర్ణయాలు అవసరమని పేర్కొంది. నీట్ పరీక్ష నిర్వహణలో ప్రతిపాదిత సంస్కరణలకు సంబంధించిన అంశాలపై వేసవి సెలవుల అనంతరం సుదీర్ఘ విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. దీంతో భవిష్యత్తులో పరీక్షా విధానంలో మార్పులు, భద్రతా చర్యలు, నిర్వహణ వ్యవస్థలపై విస్తృత చర్చ జరిగే అవకాశం ఏర్పడింది.