Supreme Court: డిజిటల్ మోసాల్లో డబ్బు పోగొట్టుకుంటే బ్యాంకులే పరిహారం చెల్లించాలి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
డిజిటల్ మోసాల కారణంగా ఖాతాదారులు డబ్బు కోల్పోతే అందుకు బ్యాంకులే బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఖాతాదారులను సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలపై ఉందని పేర్కొంది. ముఖ్యంగా డిజిటల్ అరెస్టు వంటి మోసాల విషయంలో బ్యాంకులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే బాధితులు నష్టపోయినట్లు రుజువైతే.. వారు కోల్పోయిన మొత్తాన్ని పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఖాతాదారుల సాధారణ లావాదేవీలకు భిన్నంగా అనుమానాస్పదంగా కనిపించే లావాదేవీలను గుర్తించి తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీంకోర్టు సూచించింది. అనుమానాస్పద కార్యకలాపాలపై ఆటోమేటిక్‌గా హెచ్చరికలు పంపడం, లావాదేవీల నిజానిజాలను నిర్ధారించేందుకు అవసరమైన సందర్భాల్లో భౌతికంగా ధృవీకరించడం వంటి నివారణ చర్యలు తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది.
వివరాలు
బ్యాంకుల బాధ్యతపై సీజేఐ కీలక ప్రశ్నలు
ఈ అంశాలను ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వీ మోహన్‌లతో కూడిన ధర్మాసనం మరోసారి స్పష్టం చేసింది.
బ్యాంకుల బాధ్యతపై విచారణ సందర్భంగా సీజేఐ కీలక ప్రశ్నలు సంధించారు.
ఖాతాదారులను మోసాల నుంచి రక్షించడం బ్యాంకర్ల బాధ్యత కాదా? ఇందుకోసం మీ అధికారిక వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? అని ప్రశ్నించారు.
పెద్ద కంపెనీలకు సంబంధించిన భారీ లావాదేవీలను గుర్తించడం కొంత కష్టమవ్వొచ్చని, కానీ సాధారణంగా రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు మాత్రమే విత్‌డ్రా చేసే వ్యక్తి ఒక్కసారిగా రూ.50 వేలు తీసుకుంటే అలాంటి అసాధారణ లావాదేవీని గుర్తించలేరా? అని నిలదీశారు.
వివరాలు
బ్యాంకుల నిర్లక్ష్యానికి బాధితులకు పరిహారం
ఖాతాదారుల లావాదేవీల తీరును పరిశీలిస్తూ అనుమానాస్పద కార్యకలాపాలను ముందుగానే గుర్తించే వ్యవస్థలు బ్యాంకుల్లో ఉండాలని అభిప్రాయపడ్డారు.
స్వయంగా విచారణకు స్వీకరించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)లో భాగంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఆర్థిక సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో, తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమైనట్లు తేలితే బాధితులకు న్యాయం జరిగేలా ప్రతిపాదిత నియంత్రణ చట్టంలో పరిహార నిబంధనలు ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
మోసాల కారణంగా నష్టపోయిన ఖాతాదారులకు కనీసం వారు కోల్పోయిన మొత్తమైనా తిరిగి అందేలా నిబంధనలు రూపొందించాలని సూచించింది.
వివరాలు
డిజిటల్ అరెస్టు మోసాలపై కోర్టు ఆందోళన
దేశంలో డిజిటల్ అరెస్టు మోసాలు ఇంకా కొనసాగుతుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
చదువుకున్న, అవగాహన ఉన్న పౌరులు సైతం ఇలాంటి మోసగాళ్ల వలలో ఎలా చిక్కుకుంటున్నారని సీజేఐ ప్రశ్నించారు.
డిజిటల్ అరెస్టు పేరుతో ఎవరో ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్టు చేశామని చెబితే.. ఆ మాటలను ప్రజలు ఎలా నమ్ముతున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇలాంటి బెదిరింపులకు ప్రజలు ఎందుకు భయపడుతున్నారని, ఆ భయంతోనే మోసగాళ్ల మాటలకు ఎలా లొంగిపోతున్నారని ప్రశ్నించారు.
ఇది ఒకరకమైన భయాందోళన పరిస్థితిని సృష్టిస్తోందని వ్యాఖ్యానించారు.
దేశంలో ఇలాంటి నేరాలకు ప్రజలు బాధితులవుతుంటే.. భవిష్యత్తు తరాలకు మనం ఎలాంటి వ్యవస్థను అందించగలమని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు.
వివరాలు
అన్ని ఆర్థిక సంస్థలకు వర్తించేలా మార్గదర్శకాలు
తదుపరి విచారణ సమయానికి దేశంలోని అన్ని అధికారిక ఆర్థిక సంస్థల పూర్తి జాబితాను సమర్పించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఒక్కో బ్యాంకును విడివిడిగా ఈ విచారణలో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం లేకుండా.. అన్ని ఆర్థిక సంస్థలకు వర్తించేలా ఉమ్మడి ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం వెల్లడించింది.
ప్రతిపాదిత మార్గదర్శకాల పరిధిలోకి వచ్చే ఆర్థిక సంస్థల వివరాలతో పాటు.. డిజిటల్ మోసాల బాధితులకు నష్టపరిహారం అందించేందుకు తీసుకోవాలని భావిస్తున్న చర్యల గురించి కూడా వివరాలు సమర్పించాలని కోరింది.
వివరాలు
అన్ని ఆర్థిక సంస్థలకు వర్తించేలా మార్గదర్శకాలు
అంతేకాకుండా, డిజిటల్ అరెస్టు మోసాలకు గురయ్యే ప్రమాదం ఉందని అనుమానం కలిగించే ఖాతాదారుల అసాధారణ లావాదేవీలపై సమీపంలోని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించాల్సిన బాధ్యత కూడా బ్యాంకులదేనని స్పష్టం చేసింది.
అనుమానాస్పద లావాదేవీలను సకాలంలో గుర్తించి పోలీసులను అప్రమత్తం చేయడం ద్వారా మరింత మంది ఖాతాదారులు డబ్బు కోల్పోకుండా అడ్డుకోవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది.