Supreme court on Airfares: నిబంధనలు పాటించని విమానయాన సంస్థల సేవలు నిలిపివేయండి: సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
విమాన ఛార్జీల పెరుగుదలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. రద్దీ సమయాల్లో విమాన టికెట్ ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న తీరును తప్పుపట్టింది. ఛార్జీలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను పాటించని విమానయాన సంస్థల సేవలను నిలిపివేయాల్సిన అవసరం ఉందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. విమాన ఛార్జీల అసాధారణ పెరుగుదలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
వివరాలు
సుప్రీంకోర్టును ఆశ్రయించిన సామాజిక కార్యకర్త
విమాన టికెట్ల ధరల్లో భారీ హెచ్చుతగ్గులు, విమానయాన సంస్థలు వసూలు చేస్తున్న అదనపు ఛార్జీలను సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త ఎస్. లక్ష్మీనారాయణన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ముఖ్యంగా రద్దీ సమయాల్లో విమాన టికెట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌పై తాజాగా మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. విమానయాన సంస్థలు అమల్లో ఉన్న నిబంధనలను కూడా సక్రమంగా పాటించడం లేదన్న వాదనలను పరిశీలించింది.
నిబంధనలు పాటించని విమానయాన సంస్థలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని, అవసరమైతే వాటి సేవలను నిలిపివేయాలని వ్యాఖ్యానించింది.
వివరాలు
కొత్త నిబంధనలపై కేంద్రానికి గడువు
ఇదే కేసులో గత విచారణ సందర్భంగా 'భారతీయ వాయుయాన్ అధినియం, 2024' కింద రూపొందిస్తున్న కొత్త నిబంధనలను రెండు వారాల్లో సీల్డ్ కవర్‌లో సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో కేంద్రం తరఫున విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ కౌశిక్.. నిబంధనల రూపకల్పన తుది దశకు చేరుకుందని ధర్మాసనానికి తెలిపారు.
విమాన ఛార్జీలు, సర్జ్ ప్రైసింగ్, అధిక లగేజీకి సంబంధించిన తుది నిబంధనలను మూడు వారాల్లోగా కోర్టుకు తెలియజేస్తామని కేంద్రం తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
ఈ గడువుకు ధర్మాసనం అంగీకరించింది. అనంతరం కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 7కు వాయిదా వేసింది.