మణిపూర్ ఘటనపై సుప్రీం సీరియస్.. రాజ్యాంగ ఉల్లంఘనలపై ఏం చేశారని కేంద్రాన్ని నిలదీత
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకుంది. ఈ క్రమంలో కుకీ తెగకు చెందిన గిరిజన మహిళలపై అమానుష చర్యలను ముక్తకంఠంతో ఖండించింది. ఈశాన్య రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని కేంద్రాన్ని గట్టిగా నిలదీసింది. బాధ్యులపై ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోతే, తామే చర్యలు ప్రారంభిస్తామని తేల్చి చేప్పింది. ఈ మేరకు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఎస్టీ రిజర్వేషన్ల కోసం మణిపూర్‌లో చెలరేగిన అల్లర్లు చివరకు మహిళలను వివస్త్రలను చేసే స్థితికి దిగజారిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మోదీజీ, అమిత్ జీ మీ సమయాన్ని, శక్తిని మణిపూర్ రక్షణ కోసం వెచ్చించండి : మంత్రి కేటీఆర్
మే 4న ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘోర ఘటన తాజాగా వైరల్ గా మారింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపణలకు దారి తీసింది. నిస్సహాయ స్థితిలోని బాధిత మహిళల ఆర్తనాదాలపై ఎవరూ కనికరం చూపలేదు. మరోవైపు నగ్నంగా ఊరేగించిన వీడియోలను తక్షణమే తొలగించాల్సిందిగా ట్విట్టర్ సహా అన్ని మీడియా సంస్థలను కేంద్రం ఆదేశించింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ మణిపూర్ ఘటనపై స్పందించారు. దేశంలోనే మణిపూర్ లో కుకీ తెగ స్త్రీలను మైతీలు నగ్నంగా ఊరేగించడాన్ని ఖండించారు. బాధితులను లైంగిక వేధింపులకు గురిచేయడం బాధాకరమన్నారు. మోదీ జీ.. అమిత్‌షా జీ ఎక్కడ ఉన్నారు, మీ సమయాన్ని, శక్తిని మణిపూర్ రక్షణ కోసం వెచ్చించాలని కోరారు.