Uttarakhand: అటవీ భూముల ఆక్రమణ.. సుమోటో కేసుగా స్వీకరించిన సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాఖండ్‌లో పెద్ద ఎత్తున అటవీ భూములు అక్రమ ఆక్రమణకు గురవుతున్న అంశంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం స్వీకరించింది. అటవీ భూములు ఆక్రమించబడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకుడిలా మౌనంగా ఉండడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. అటవీ భూముల ఆక్రమణలపై దర్యాప్తు చేయడానికి ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసి, ఆ నివేదికను సమర్పించాలని ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వివరాలు
మూడో పక్షాలు ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టకూడదు: కోర్టు
కళ్లముందే అటవీ భూములు కబ్జా అవుతున్నా సంబంధిత అధికారులు మౌనంగా ఉండటం ఆశ్చర్యకరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కారణంగానే ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. చీఫ్ సెక్రటరీతో పాటు ప్రిన్సిపల్ కన్జర్వేషన్ సెక్రటరీ నివేదిక సమర్పించే వరకు, మూడో పక్షాలు ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టకూడదని కోర్టు ఆదేశించింది. అలాగే, నివాస గృహాలు ఉన్న భూములను మినహాయించి,ఖాళీగా ఉన్న అటవీ భూములను అటవీ శాఖ తమ ఆధీనంలోకి తీసుకోవాలని కోర్టు స్పష్టంచేసింది. అనితా ఖండ్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు వాదనలు నిర్వహించింది.