పెద్ద నోట్ల రద్దు.. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు
పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు అంశం చెల్లుబాటు అవుతుందని ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు జడ్జీలు తీర్పు చెప్పారు. జస్టిస్ నాగరత్నం ఒక్కరే.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తన జడ్జిమెంట్‌ను రాశారు. పెద్ద నోట్ల రద్దును పార్లమెంట్‌లో చట్టం చేసి.. అమలు చేస్తే బాగుండేదని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. ఈ విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించిందని చెప్పారు. ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పార్లమెంట్ జ్యోక్యాన్ని విస్మరించేలేమన్నారు. నోట్ల రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయం లోపభూయిష్టంగా లేదని.. ఆర్బీఐ, కేంద్రం మధ్య సంప్రదింపుల తర్వాతే ఈనిర్ణయం తీసుకున్నారని మిగతా నలుగురు జడ్జిలు చెప్పారు.
4:1 తేడాతో తీర్పు ఆమోదం
జస్టిస్ నజీర్, జస్టిస్ గవాయ్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌తో కూడిన ధర్మాసనం.. ఈ తీర్పును 4:1 తేడాతో ఆమెదించారు. 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన తర్వాత.. ఈ అంశంపై దాదాపు 58 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ తీర్పు సందర్భంగా ఆ పిటిషన్లన్నీ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్ నజీర్ పదవీకాలం జనవరి 4తో ముగియనున్న నేపథ్యంలో ఆయన వృత్తి జీవితంలో ఈ తీర్పు మైలురాయిగా నిలవనుంది. పెద్దనోట్ల రద్దుకు వ్యతిరకేంగా కాంగ్రెస్ సీనియర్ నేత, న్యాయవాది చిదంబరం బలంగా వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో సుదీర్ఘ చర్చ అనంతరం సుప్రీంకోర్టు తాజా తీర్పును వెలువరించింది.