Hyderabad: 20 ఏళ్ల వివాదానికి తెర..102 ఎకరాలు అటవీశాఖవే: సుప్రీంకోర్టు తీర్పు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగర కేంద్రానికి సమీపంలో మరో కొత్త అభయారణ్యం ఏర్పడబోతోంది. సాగర్ హైవే పక్కన ఉన్న సాహెబ్‌నగర్-గుర్రంగూడ మధ్య విస్తరించిన 102ఎకరాల అటవీ భూములపై దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు తాజాగా ముగింపు పలికింది. ఈ భూములు పూర్తిగా అటవీశాఖకే చెందినవేనని గురువారం స్పష్టం చేస్తూ తుది తీర్పు వెలువరించింది. దీంతో ఇప్పటికే అక్కడ ఉన్న అటవీ విస్తీర్ణంతో ఈ భూములు విలీనం కానున్నాయి. ప్రస్తుతం ఈ భూముల మార్కెట్ విలువ రూ.5వేల కోట్లకు పైగానే ఉందని అంచనా. రెండు వారాల లోపు ఈ ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వివరాలు
ఇదీ నేపథ్యం.. వివాదం
కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా అటవీశాఖ అధికారులు ఒకటి రెండు రోజుల్లో భూముల చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుర్రంగూడ పరిధిలో అటవీశాఖకు విస్తారమైన అటవీ భూములు ఉన్నాయి. నాగార్జున సాగర్ హైవేకు ఆనుకుని, రోడ్డుకు ఎడమ వైపున ఉన్న 102ఎకరాల భూమి తమ సొంతమని పేర్కొంటూ సుమారు ఇరవై సంవత్సరాల క్రితం కొందరు వ్యక్తులు జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత మరో 200మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం 2021లో ఆ భూములు ప్రైవేట్ వ్యక్తులవేనంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అటవీశాఖ అధికారులు రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
వివరాలు
ఆఖరి వాయిదా.. ఫలించిన ఆలోచన
సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన అటవీశాఖ, కేసు విచారణ సమయంలో భూమికి సంబంధించిన పూర్తి రికార్డులను సమర్పించింది. బలమైన ఆధారాలు సమకూర్చుకునేందుకు అధికారులు న్యాయవాదులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రైవేట్ వ్యక్తులు సమర్పించిన పత్రాల నిజానిజాలు తేల్చాలని నిర్ణయించి,కోర్టు అనుమతితో వాటిని హైదరాబాద్‌లోని రాజ్యాభిలేఖ కార్యాలయానికి పంపించారు. అక్కడ నిర్వహించిన పరిశీలనలో ఆ పత్రాలు నకిలీవిగా తేలాయి. ఈ విషయాన్ని అన్ని ఆధారాలతో సహా అటవీశాఖ అధికారులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లగా, చివరికి కోర్టు అటవీశాఖకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.