Amit Shah: లొంగిపోయిన మావోయిస్టులకు ఇల్లుతో పాటు ఉపాధి
మావోయిస్టులు హింసను విడనాడి సమాజంలో భాగమవ్వాలని కోరుతూ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వారిపై వరాల జల్లు కురిపించారు. ఛత్తీస్‌గఢ్ పర్యటనలో భాగంగా బస్తర్ ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా, లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించడం ద్వారా వారికి కొత్త జీవితం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. లొంగిపోయిన మావోయిస్టుల కోసం ప్రభుత్వం 15,000 ఇళ్లు నిర్మించనుంది. ఇవి మాత్రమే కాకుండా వారికి జీవనోపాధి అందించేందుకు పాడి పరిశ్రమలో భాగస్వామ్యం కల్పిస్తామని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఆవు లేదా గేదె అందించడంతో పాటు పాడి సహకార సంఘాల ఏర్పాటు ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు రూ.15,000 ఆదాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
హింసను కొనసాగిస్తే గట్టి చర్యలు
హింసను విడనాడి పునరావాస కార్యక్రమంలో చేరితే ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని, కానీ హింస కొనసాగిస్తే భద్రత దళాలు ధీటుగా ఎదుర్కొంటాయని అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీ స్థాయిలో మావోయిస్టుల సంఖ్య తగ్గిందని అమిత్ షా పేర్కొన్నారు. 287 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారని, 837 మంది లొంగిపోయారని చెప్పారు. ముఖ్యంగా 952 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు అరెస్టు చేశాయన్నారు. అమిత్ షా బస్తర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ప్రాంతం భవిష్యత్‌లో కాశ్మీర్‌ను మించిపోయే పర్యాటక కేంద్రంగా మారుతుందని ఆకాంక్షించారు. 2026లో జరిగే బస్తర్ ఒలింపిక్స్‌కు ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.