SAS Survey: తెలంగాణలో సీట్లు తగ్గినా.. మూడోసారి బీఆర్ఎస్‌దే విజయం.. 'ఆత్మ సాక్షి' సర్వే వెల్లడి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపై ప్రధాన రాజకీయ పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఇప్పటికే మెజార్టీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించి.. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదంటే, తమదనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రముఖ ప్రజాభిప్రాయ సేకరణ సంస్థ.. శ్రీ ఆత్మ సాక్షి (ఎస్ఏఎస్) తెలంగాణలోని పరిస్థితి, గ్రౌండ్ రియాలిటీపై చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. తెలంగాణలో మరోసారి బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని సర్వే తెలిపింది. ఆశ్చర్యకరంగా ఆ పార్టీకి ఈసారి తక్కువ సీట్లు, ఓట్లు వస్తాయని వెల్లడించింది. అయినా మూడోసారి పవర్‌లోకి వస్తుందని అంచనా వేసింది. అక్టోబర్ 28 వరకు నిర్వహించిన సర్వే ఫలితాలను ఆత్మ సాక్షి వెల్లడించింది.
బీజేపీకి పెరగనున్న ఓట్ల శాతం
బీఆర్ఎస్‌కు 42.5 శాతం ఓట్లను పొంది.. 64 నుంచి 70సీట్లలో విజయం సాధిస్తుందని, కాంగ్రెస్‌కు 36.5 శాతం ఓట్లు వచ్చి.. దాదాపు 37 నుంచి 43 సీట్లలో గెలుస్తుందని ఆత్మ సాక్షి సర్వే అంచనా వేసింది. ఈ సారి బీజేపీ ఓట్ల శాతం భారీగా పెరుగుతుందని, ఆ పార్టీకి 10.75 శాతం ఓట్లు వస్తాయని.. అలాగే 5 నుంచి 6 సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని చెప్పింది. ఇక మజ్లిస్ పార్టీ తన సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకుందని ఆత్మసాక్షి పేర్కొంది. ఎంఐఎం ఏడు సీట్లను గెలుచుకొని, 2.75 శాతం ఓట్లను రాబట్టుకుంటుందని చెప్పింది. ఇతరులు 7.5 శాతం ఓట్లను సాందించి.. రెండు లేదా మూడు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని వివరించింది.
ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది.. ఫలితాలు మారొచ్చు: ఆత్మ సాక్షి
తెలంగాణలోని 110అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,65,000మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. 820మంది ఎన్యూమరేటర్లతో సర్వే నిర్వహించారు. కమ్యూనిటీలు, ప్రాంతాలు, ఇలా వివిధ వర్గాలను స్పృశిస్తూ సర్వే చేసినట్లు ఎస్‌ఎఎస్ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. 2018లో ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ఆత్మ సాక్షి సర్వే అంచనా వేసింది. అది చివరికి నిజమైంది. రానున్న రోజుల్లో ప్రీ పోల్ సర్వే, ఎగ్జిట్ పోల్ సర్వేలను ప్రకటిస్తామని ఆత్మసాక్షి గ్రూప్ చెబుతోంది. ఆశ్చర్యకరంగా, రాబోయే రోజుల్లో మారుతున్న పరిణామాల కారణంగా ఫలితాల్లో మార్పులు ఉండవచ్చని ఆత్మ సాక్షి తెలిపింది. అయితే కొన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ అనుకూలంగా కూడా ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అయితే పోలింగ్ జరిగి ఫలితాలు వెల్లడైన తర్వాత జనం నాడి ఎంటో తెలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.