Page Loader
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి ఘటనలో కీలక ఆధారం..  నంబర్ ప్లేట్ లేని బైక్ లభ్యం
పహల్గాం ఉగ్రదాడి ఘటనలో కీలక ఆధారం.. నంబర్ ప్లేట్ లేని బైక్ లభ్యం

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి ఘటనలో కీలక ఆధారం..  నంబర్ ప్లేట్ లేని బైక్ లభ్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 23, 2025
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో మంగళవారం (ఏప్రిల్ 22) చోటుచేసుకున్న పర్యాటకులపై ఉగ్రవాద దాడికి సంబంధించి భద్రతా ఏజెన్సీల నుంచి మరో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. దాడి జరిగిన ప్రదేశానికి సమీపంలో ఒక అనుమానాస్పద బైక్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బైక్ నలుపు రంగులో ఉండి,దానికి నంబర్ ప్లేట్ లేకపోవడం భద్రతా సిబ్బందిని మరింత అప్రమత్తం చేసింది. ఈ బైక్‌ను ఉగ్రవాదులు ఉపయోగించి సంఘటనా స్థలానికి చేరుకున్నట్టు అనుమానం వ్యక్తమవుతోంది. పైగా ముగ్గురికిపైగా ఉగ్రవాదులు ఈ బైక్‌పై ప్రయాణించి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. ఒక్క బైక్‌కే పరిమితం కాకుండా,పలువురు ఉగ్రవాదులు ఒకటి కంటే ఎక్కువ వాహనాలను ఉపయోగించి దాడికి చేరుకున్న అవకాశమూ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వివరాలు 

ఈ బైక్ ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది?

OGW (ఓవర్ గ్రౌండ్ వర్కర్లు) అనే నెట్వర్క్ ద్వారా ఉగ్రవాదులకు ఈ బైక్‌లు సమకూర్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ బైక్ ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఉగ్రవాద దాడి కేవలం భారత్‌ను మాత్రమే కాకుండా, అంతర్జాతీయంగా కూడా తీవ్రంగా కలవరపరిచింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కి తమ మద్దతును తెలియజేశాయి. దాడి జరిగిన ప్రదేశం దగ్గర నంబర్ ప్లేట్ లేని నల్ల బైక్ కనిపించడంతో, అది ప్రస్తుతం పెద్ద చర్చకు కారణమైంది.

వివరాలు 

 ఈ అమానుష ఘ్తనకు బాధ్యత వహించిన లష్కరే తోయిబా

'మినీ స్విట్జర్లాండ్'గా పేరొందిన పహల్గామ్‌లో జరిగిన ఈ హేయకార్యాచరణలో 28 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఈదాడికి లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాల్పుల అనంతరం దుండగులు సమీప అడవుల్లోకి పారిపోయారు. వారి కోసం భద్రతా బలగాలు శోధన చర్యలు ముమ్మరం చేశాయి. ఈ దాడి,2019లో పుల్వామాలో జరిగిన దాడికి అనంతరం జమ్మూ కాశ్మీర్ లోయలో చోటుచేసుకున్న మరొక అత్యంత ఘోర ఘటనగా గుర్తించబడుతోంది. ఈ మంగళవారం అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్‌లో చోటుచేసుకున్న ఈ దాడిలో ఇద్దరు విదేశీయులు సహా మొత్తం 28 మంది పర్యాటకులు మరణించారు. అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు.పుల్వామా దాడి తరువాత లోయలో ఇంతటి విలయం కలిగించిన సంఘటన ఇదే.

వివరాలు 

రాష్ట్ర బంద్‌కు పిలుపు

ఈ దాడిని నిరసిస్తూ పలు రాజకీయ, సామాజిక సంఘాలు బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీతో పాటు జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ విభాగం, జమ్మూ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, జమ్మూ బార్ అసోసియేషన్, విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ బజరంగ్ దళ్ వంటి సంస్థలు ఒకే గొంతుతో బంద్‌కు మద్దతు ప్రకటించాయి. జమ్మూలో భద్రతను అధికారులు కట్టుదిట్టంగా నిర్వహించారు. పాకిస్తాన్ ప్రోత్సాహంతో జరుగుతున్న ఉగ్రవాదాన్ని ఖండిస్తూ వీరు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.