Asish Banerjee: పార్టీ కార్యాలయంలో.. మమతా బెనర్జీ సన్నిహితుడి అనుమానాస్పద మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ నేత ఆశిష్ బెనర్జీ మృతి చెందారు. బీర్భూమ్ జిల్లా రాంపూర్‌హాట్‌లోని తన ఇంటి పక్కనే ఉన్న టీఎంసీ కార్యాలయంలో ఆదివారం ఉదయం ఆయన మృతదేహం లభ్యమైంది. కార్యాలయంలో ఉరికి వేలాడుతున్న స్థితిలో ఆయన మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆశిష్ బెనర్జీ రాంపూర్‌హాట్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. మమతా బెనర్జీ తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. విద్య, వ్యవసాయ శాఖలకు మంత్రిగా పనిచేశారు.
వివరాలు
జూన్‌లో కీలక పదవికి రాజీనామా
రాంపూర్‌హాట్‌లోని హట్టాలపారా ప్రాంతంలో ఆశిష్ బెనర్జీ నివసించేవారు. ఆయన మృతి విషయం తెలియడంతో టీఎంసీ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు.
బీర్భూమ్ జిల్లా టీఎంసీ కోర్ కమిటీ చైర్మన్ పదవి నుంచి ఆశిష్ బెనర్జీ ఈ ఏడాది జూన్‌లో వైదొలిగారు. అయితే పార్టీ సాధారణ సభ్యుడిగా కొనసాగుతానని అప్పట్లో ప్రకటించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీర్భూమ్ జిల్లాలో మొత్తం 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను బీజేపీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది.
2021 ఎన్నికల్లో ఇదే జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్ 10 స్థానాలు గెలుచుకోగా.. బీజేపీ ఒక్క స్థానానికే పరిమితమైంది.
వివరాలు
బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామాల వేళ..
పశ్చిమ బెంగాల్‌లో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ తాజా ఎన్నికల్లో ఓటమి పాలైన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మరోవైపు పలువురు మాజీ టీఎంసీ ఎమ్మెల్యేలు, నేతలు అవినీతి ఆరోపణలకు సంబంధించిన దర్యాప్తులు, అరెస్టులను ఎదుర్కొంటున్నారు.
ఈ పరిణామాల మధ్య ఆశిష్ బెనర్జీ మృతి చెందడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.