Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్తత.. సువేందు అధికారి పీఏ దారుణ హత్య..
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతరం పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ప్రతిపక్ష నేతగా ఉన్న, ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారుడిగా భావిస్తున్న సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్ ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు అతికొద్దీ దూరం నుంచి ఆయనపై కాల్పులు జరిపారు. ప్రజలు చూస్తుండగానే నడిరోడ్డుపై ఈ దాడి జరిగింది. తీవ్ర గాయాలపాలైన ఆయనను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. చంద్రనాథ్ రథ్ సువేందు అధికారికి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
వివరాలు
80 మంది అరెస్టు
నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కాల్పులకు గల కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. ఇదిలా ఉండగా కోల్‌కతాలోని మార్కెట్ ప్రాంతంలో మాంసం దుకాణాలను బుల్డోజర్లతో ధ్వంసం చేసిన ఘటన ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ చర్యలకు భాజపా కార్యకర్తలే కారణమని తృణమూల్ ఆరోపించింది. అయితే తమ పార్టీ జెండాలు ఉపయోగించి ఈ దాడులను తృణమూల్ కార్యకర్తలే నిర్వహించారని బీజేపీ ఎదురు ఆరోపణలు చేసింది. కోల్‌కతాలో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న 80 మందిని అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ అజయ్ కుమార్ నంద్ వెల్లడించారు. మరోవైపు ఈ నెల 9న కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.
వివరాలు
ముఖ్యమంత్రి పదవికి ముందంజలో సువేందు
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నరేంద్ర మోదీ , కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు ఎన్డీయే నాయకులు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి పదవికి ఎవరు ఎంపికవుతారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ప్రస్తుత ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఈ పదవికి ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తృణమూల్ పార్టీకి చెందిన కొత్త ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు మమతా బెనర్జీ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భాజపా ఎన్నికలను అక్రమంగా ప్రభావితం చేసిందని మమత ఆరోపించారు. ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రకటించారు.