LOADING...
Suvendu Adhikari: మమతను ఓడించి చరిత్ర సృష్టించిన సువేందు.. ఆయన గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలివే!
మమతను ఓడించి చరిత్ర సృష్టించిన సువేందు.. ఆయన గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలివే!

Suvendu Adhikari: మమతను ఓడించి చరిత్ర సృష్టించిన సువేందు.. ఆయన గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 09, 2026
08:53 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక కొత్త శకం ప్రారంభమైంది. దశాబ్దాల నిరీక్షణ అనంతరం రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ (BJP) ప్రభుత్వం ఏర్పాటవుతోంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన సువేందు అధికారి, రాష్ట్ర 9వ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కోల్‌కతాలోని చారిత్రక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో ఈ ప్రమాణ స్వీకార వేడుక ఘనంగా నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే వివిధ ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. అమిత్ షా స్వయంగా సువేందు అధికారి పేరును ప్రతిపాదించగా, మొత్తం ఎనిమిది ప్రతిపాదనలు వచ్చినప్పటికీ అన్నింటిలోనూ ఆయన పేరే ఉండటంతో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది.

వివరాలు

గతంలో మమతా బెనర్జీకి నమ్మకమైన అనుచరుడు

ఎన్నికైన వెంటనే సువేందు అధికారి రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆర్.ఎన్. రవిని కలుసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు అధికారికంగా అనుమతి కోరారు. సువేందు అధికారి జీవితం రాజకీయంగా విశేష మలుపులు తిరిగింది. 55 ఏళ్ల వయసున్న ఆయన ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత నమ్మకమైన అనుచరుడిగా ఉన్నారు. అయితే ఇప్పుడు అదే మమతాను ఓడించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం రాజకీయంగా పెద్ద సంచలనంగా మారింది. "బెంగాల్ నుంచి భయం పోయింది, నమ్మకం వచ్చింది" అని సువేందు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ముఖ్యమంత్రి అవుతున్న తొలి నేతగా ఆయన నిలుస్తున్నారు. 1971లో అజోయ్ ముఖర్జీ తర్వాత జిల్లాల నుంచి వచ్చిన నేతగా సీఎం బాధ్యతలు చేపడుతున్న వ్యక్తిగా సువేందు రికార్డు సృష్టించనున్నారు.

వివరాలు

బీజేపీలో చేరి మమతా బెనర్జీకి ప్రధాన ప్రత్యర్థిగా గుర్తింపు

మాజీ కేంద్ర మంత్రి సిసిర్ అధికారి కుమారుడైన సువేందు, తొలుత కాంగ్రెస్ విద్యార్థి విభాగం 'ఛత్ర పరిషత్' ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనంతరం తృణమూల్ కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగి, తర్వాత బీజేపీలో చేరి మమతా బెనర్జీకి ప్రధాన ప్రత్యర్థిగా మారారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గానూ బీజేపీ 207 సీట్లతో భారీ విజయం సాధించింది. తృణమూల్ కాంగ్రెస్ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. అయితే ఎన్నికల ఫలితాలను మమతా బెనర్జీ అంగీకరించలేదు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, ప్రజా తీర్పును కుట్రపూరితంగా ప్రభావితం చేశారని ఆమె ఆరోపించారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేశారు.

Advertisement

వివరాలు

ప్రతి హామీని నెరవేరుస్తాం

ఇదిలా ఉండగా గవర్నర్ ఆర్.ఎన్. రవి ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేసి, సువేందు అధికారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించినట్లు సమాచారం. బీజేపీ నాయకత్వం మాత్రం బెంగాల్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, రాష్ట్రానికి స్థిరమైన పాలన అందిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.

Advertisement