Loading...
Telangana : సర్కారులో 'టీ-ఫైబర్‌' జోరు మందగింపు.. ఇప్పటికీ 10% కార్యాలయాలకే సేవలు
సర్కారులో 'టీ-ఫైబర్‌' జోరు మందగింపు.. ఇప్పటికీ 10% కార్యాలయాలకే సేవలు

Telangana : సర్కారులో 'టీ-ఫైబర్‌' జోరు మందగింపు.. ఇప్పటికీ 10% కార్యాలయాలకే సేవలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2026
04:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వ కార్యాలయాల్లో సురక్షితమైన, వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలను అందించడంతో పాటు భారీగా ఖర్చు ఆదా చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'టీ-ఫైబర్‌' సేవలు ఇంకా ఆశించిన స్థాయిలో విస్తరించలేదు. ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ టీ-ఫైబర్‌తో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆదేశించినప్పటికీ, అమలు మాత్రం నత్తనడకన సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో కేవలం 10 శాతం మాత్రమే టీ-ఫైబర్‌ పరిధిలోకి వచ్చాయి. ఎనిమిది నెలలుగా ఫ్యూచర్‌ సిటీ కార్యాలయం, యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ, రాష్ట్ర సచివాలయం మొత్తం, రాష్ట్ర డేటా సెంటర్‌కు టీ-ఫైబర్‌ సేవలందుతున్నాయి. అయినప్పటికీ మిగిలిన సుమారు 90 శాతం ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికీ ప్రైవేటు ఇంటర్నెట్‌ సేవలపైనే ఆధారపడుతున్నాయి.

వివరాలు

4,487 ప్రభుత్వ కార్యాలయాల్లోనే టీ-ఫైబర్

రాష్ట్రంలోని 30 ప్రభుత్వ శాఖల్లో మొత్తం 417 మంది శాఖాధిపతులు పనిచేస్తున్నారు.

ఈ శాఖల పరిధిలో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆసుపత్రులు, బస్తీ దవాఖానాలు తదితరాలను కలుపుకుని మొత్తం 1,37,670 ప్రభుత్వ కార్యాలయాలున్నాయి.

వాటిలో ప్రస్తుతం 92,031 కార్యాలయాలు సిమ్‌ ఆధారిత లేదా ఇతర ప్రత్యామ్నాయ ఇంటర్నెట్‌ సేవలను వినియోగిస్తుండగా, 45,639 కార్యాలయాలు మాత్రమే బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను ఉపయోగిస్తున్నాయి.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మూడు నెలల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో టీ-ఫైబర్‌ సేవలను విస్తరించాలని నిర్ణయించినప్పటికీ, ఇప్పటివరకు 4,487 ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే టీ-ఫైబర్‌తో అనుసంధానమయ్యాయి. మరో 1,200 కార్యాలయాల్లో అనుసంధాన పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

వివరాలు

ఏటా రూ.13 కోట్ల వరకు ఖర్చు ఆదా

ప్రస్తుతం ఈ కార్యాలయాలు ప్రైవేటు ఇంటర్నెట్‌ సేవల కోసం సంవత్సరానికి సుమారు రూ.26.13 కోట్లు చెల్లిస్తున్నాయి.

టీ-ఫైబర్‌కు మారిన తర్వాత ఈ వ్యయం రూ.13.58 కోట్లకు తగ్గింది. అంటే ప్రభుత్వానికి ఏటా దాదాపు రూ.13 కోట్ల మేర ఆదా అవుతోంది.

అయితే పోలీస్‌ శాఖ, పాఠశాల విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, అంగన్‌వాడీ కేంద్రాలు వంటి కీలక విభాగాలు ఇంకా పూర్తిస్థాయిలో టీ-ఫైబర్‌ పరిధిలోకి రాలేదు.

ఇవి కూడా అనుసంధానమైతే ప్రభుత్వానికి మరింత భారీ స్థాయిలో ఖర్చు ఆదా అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ADVERTISEMENT