engineering colleges: ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులపై టీఏఎఫ్‌ఆర్‌సీ కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు-రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 152 ఇంజినీరింగ్ కళాశాలలకు సంబంధించిన ట్యూషన్ ఫీజులను ఖరారు చేస్తూ కమిటీ ఇటీవల ప్రభుత్వానికి జాబితా సమర్పించింది. ఆ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇందులో 70 కళాశాలల్లో గతంలో ఉన్న ఫీజులనే కొనసాగించాలని, మరో 19 కళాశాలల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ట్యూషన్ ఫీజులను తగ్గించాలని నిర్ణయించారు. అదే సమయంలో 63 కళాశాలలకు మాత్రం ఫీజులు పెంచుకునే అవకాశం కల్పించారు. ఫీజుల పెంపు విషయంలో నారాయణమ్మ ఇంజినీరింగ్ కళాశాలకు అత్యధికంగా రూ.62 వేల వరకు పెంచుకునే అనుమతి లభించింది. మిగిలిన కళాశాలలకు స్వల్ప స్థాయిలో మాత్రమే పెంపు అవకాశం ఇచ్చారు.
వివరాలు
2025 నుంచి 2028 వరకూ మూడు సంవత్సరాల బ్లాక్ పీరియడ్
విద్యాశాఖ నుంచి అధికారికంగా జీవో విడుదలైన వెంటనే ఈ కొత్త ఫీజులు 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. ఇవి 2025 నుంచి 2028 వరకూ మూడు సంవత్సరాల బ్లాక్ పీరియడ్‌కు వర్తించనున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా సీబీఐటీ కళాశాలలో ట్యూషన్ ఫీజు రూ.1.83 లక్షలుగా ఖరారైంది. గత విద్యా సంవత్సరంలో ఈ కళాశాలలో ఫీజు రూ.1.65 లక్షలుగా ఉండగా, ఈసారి రూ.18 వేల పెంపు జరిగింది. ఇక నారాయణమ్మ కళాశాలలో ఫీజును అత్యధికంగా రూ.62 వేల వరకు పెంచారు. 2019లో ఈ కళాశాలలో ఫీజు రూ.1.22 లక్షలుగా ఉండగా, 2022లో దాన్ని రూ.లక్షకు దిగువకు తగ్గించారు. ఆ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఈసారి పెద్ద మొత్తంలో పెంపు చేసినట్లు తెలుస్తోంది.
వివరాలు
ఏడాది వరకు అమల్లో ఉన్న ఫీజుల్లో కోత
మొత్తం పెంపుల వివరాలు పరిశీలిస్తే, 9 కళాశాలల్లో రూ.20 వేల నుంచి రూ.35 వేల లోపు, మరో 18 కళాశాలల్లో రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు, 36 కళాశాలల్లో రూ.10 వేల లోపు ఫీజు పెంచారు. స్వామి వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కేవలం రూ.50 మాత్రమే పెంచగా, మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్‌లో రూ.200 పెంపు జరిగింది. ఇక 19 కళాశాలల్లో గత ఏడాది వరకు అమల్లో ఉన్న ఫీజుల్లో కోత విధించారు. ఈ తగ్గింపు కనీసంగా రూ.3,400 నుంచి గరిష్ఠంగా రూ.43 వేల వరకు ఉంది. గురునానక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇప్పటివరకు రూ.1.20 లక్షలుగా ఉన్న ఫీజును ఈసారి రూ.77 వేలకు తగ్గించారు.
వివరాలు
రూ.లక్ష ఫీజు ఖరారైన కళాశాలల జాబితాలో గేట్, లార్డ్స్, మాతృశ్రీ కళాశాలలు
రూ.లక్షకు మించి ట్యూషన్ ఫీజు ఖరారైన కళాశాలల జాబితాలో సీబీఐటీ (రూ.1.83 లక్షలు), వాసవి (1.75),ఎంజీఐటీ (1.67),సీవీఆర్ (1.63),నారాయణమ్మ (1.62),గోకరాజు (1.60),వీఎన్‌ఆర్ (1.59),ఏస్ (1.10), అను బోస్ (1.08),బీవీఆర్‌ఐటీ (1.46),బీవీఆర్‌ఐటీ మహిళా కళాశాల (1.43),గీతాంజలి (1.21),గురునానక్ టెక్నికల్ (1.29),హితమ్ (1.05), శ్రీఇందు (1.15), జేబీఐటీ (1.10), కేజీ రెడ్డి (1.03), కిట్స్ (1.46), కేఎంఐటీ (1.29), ముఫకంజా (1.25), ఎంవీఎస్‌ఆర్ (1.44), శ్రీదత్త (1.01), శ్రీదేవి (1.37), శ్రీనిధి (1.33), ఎస్‌ఆర్ (1.41), శ్రేయాస్ (1.06), టీకేఆర్ (1.03), వాగ్దేవి (1.05), వీబీఐటీ (1.03), విజ్ఞాన్ (1.23), వర్ధమాన్ (1.40), విజ్ఞాన్స్ మహిళా కళాశాల (1.04) ఉన్నాయి. అలాగే రూ.లక్ష ఫీజు ఖరారైన కళాశాలల జాబితాలో గేట్, లార్డ్స్, మాతృశ్రీ కళాశాలలు ఉన్నాయి.