
Narayana: ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు : నారాయణ
ఈ వార్తాకథనం ఏంటి
భవన నిర్మాణాలకు సంబంధించి ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి అనుమతులు పొందవచ్చని తెలిపారు. లేఅవుట్‌లు, భవనాలకు సంబంధించిన మున్సిపాలిటీ రుసుములు చెల్లించిన వెంటనే అన్ని అనుమతులు అందుబాటులో ఉంటాయని వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు,తాగునీటి సరఫరా,వీధిదీపాలు,వరదనీటిని నిర్వహించడం,ఘనవ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై 15 రోజుల్లో ప్రాజెక్టు నివేదికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
పాత పన్నుల బకాయిల వసూళ్ల కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు.
ఆచార్య నాగార్జున వర్సిటీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యశాలలో 123 మంది పురపాలక కమిషనర్లు హాజరయ్యారు.
వివరాలు
మున్సిపల్ నిధులను పక్కదారి పట్టించిన వైకాపా ప్రభుత్వం
ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారాయణ, నెల్లూరు, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణకు అనుమతి లభించిందని, ఈ చర్యల ద్వారా చెత్త సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయని తెలిపారు.
2014-2019 కాలంలో మున్సిపల్ శాఖ అద్భుతమైన పనితీరు చూపించిందని, ఆ సమయంలో మున్సిపల్ పన్నులను పెంచకుండా పనులను సజావుగా నిర్వహించామని వివరించారు.
వైకాపా ప్రభుత్వం మున్సిపల్ నిధులను పక్కదారి పట్టించిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం గుత్తేదారులు ముందుకు రావడం లేదని, ఈ సమస్యను పరిష్కరించి, సీఎఫ్‌ఎంఎస్‌తో సంబంధం లేకుండా మున్సిపాలిటీలకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.
వివరాలు
123 మున్సిపాలిటీలకు తాగునీటిని అందించడమే లక్ష్యం
123 మున్సిపాలిటీలకు తాగునీటిని అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, విశాఖపట్నంలో వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని వివరించారు.
ఆధునిక సాంకేతికతను ఉపయోగించి టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని కొనసాగిస్తామని, మన సాంకేతికతను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని నారాయణ అన్నారు.