Tamato: దొంగల భయం.. టమాటా తోటకు సీసీ కెమెరాలు
టమాటా ధరలు పెరగడంతో టమాట రైతుల కుటుంబాల్లో ఆనందాలు వెల్లువిరుస్తున్నాయి. టమాటా ధరలు డబుల్ సెంచరీని దాటేశాయి. మరోవైపు కేజీ టమాటా రూ.300 వరకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే టమాటా లారీల అదృశ్యం, తోటల్లో చోరీలు జరుగుతున్న ఘటనలు మనం వింటున్నాం. తాజాగా ఓ రైతు టమాటా తోటకు ఏకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాకు చెందిన శరద్ రావత్ అనే రైతు టమాటాలను దొంగలు ఎత్తుకెళ్లకుండా పొలానికి రక్షణగా సీసీ కెమెరాలను భద్రపరిచాడు. టమాటాలకు అధిక ధర పలకడంతో పలు చోట్ల దొంగతనాలు జరుగుతున్నాయని, అందుకే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశానని రైతు పేర్కొన్నాడు
సీసీ కెమెరాల కోసం రూ.22 వేలు ఖర్చు
సీసీ కెమరాల కోసం ఇప్పటికే రూ.22 వేలు ఖర్చు అయిందని, ప్రస్తుతం మహారాష్ట్రలో కిలో టమాటా రూ.160 గా ఉందని వెల్లడించారు. సోమవారం కర్ణాటకలోని కోలార్ నుంచి రాజస్థాన్ లోని జైపూర్ కు టమాటాల లోడుతో వెళ్తున్న ట్రక్ అదృశ్యమైంది. అందులో సూమారు రూ.26 లక్షల విలువైన టమాటాలున్నాయి. ఝార్ఖండ్ కూరగాయాల మార్కెట్లో కూడా 40 కిలోల టమాటాలను దొంగలించారు. ఆగస్టు 1 నాటికి కిలో టమాటా సగటు ధర రూ.120 ఉండగా.. కేవలం వారం రోజుల్లోనే ఇది రూ.132.5కి చేరుకోవడం విశేషం.