Karthigai Deepam Row: కార్తిక దీపం వివాదం.. సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం క్షమాపణలు
ఈ వార్తాకథనం ఏంటి
కార్తిక దీపం వివాదంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు క్షమాపణలు తెలిపింది. మదురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే ఉచ్చిప్పిళ్లైయార్ ఆలయానికి చెందిన దీప మండపంపైనే మహాదీపాన్ని వెలిగించారు. అయితే, కొండపై ఉన్న సిక్కందర్ దర్గా సమీపంలోని పురాతన రాతి స్తంభంపై కార్తిక దీపాన్ని వెలిగించాలనే డిమాండ్ కొన్నేళ్లుగా వివాదానికి కారణమవుతోంది. గత ఏడాది రాతి స్తంభంపైనే దీపం వెలిగించాలని మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ ఉత్తర్వులు అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రాతి స్తంభంపై కార్తిక దీపాన్ని వెలిగించాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయినప్పటికీ మంగళవారం ఆ ఆదేశాలను అమలు చేయలేదు.
వివరాలు
సంప్రదాయాలకు విఘాతం కలుగుతుందన్న ఆలయ ట్రస్టీలు
ఆలయ యంత్రాంగం అనుమతి ఇవ్వకపోవడం వల్లే రాతి స్తంభంపై దీపం వెలిగించలేకపోయామని తమిళనాడు ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నించానని మదురై జిల్లా కలెక్టర్ న్యాయస్థానానికి వివరించారు.
కొండపై ఉన్న పురాతన రాతి స్తంభం వద్ద దీపం వెలిగిస్తే తరతరాలుగా కొనసాగుతున్న ఆలయ సంప్రదాయాలకు భంగం కలుగుతుందని ట్రస్టీలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు.
ఈ కారణంగానే ఎప్పటిలాగే ఉచ్చిప్పిళ్లైయార్ ఆలయ దీప మండపంపైనే మహాదీపాన్ని వెలిగించినట్లు వివరించారు.
మరోవైపు, సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాలని పిటిషనర్లు కోరారు.
అయితే, ఈ అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో కార్తిక దీపం వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.